YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బడ్జెట్‌ సమావేశాలకు చిరంజీవి డుమ్మా

 బడ్జెట్‌ సమావేశాలకు చిరంజీవి డుమ్మా

2018 ఏప్రిల్‌ 2తో ముగియనున్న పదవీకాలం

- రాజ్యసభ సమావేశాలకు చిరంజీవి హాజరైంది చాలా తక్కువ

మంత్రిగా కేటాయించిన బంగ్లా ఖాళీకి నోటీసులు 

రాజ్యసభ సమావేశాలకు ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి డుమ్మా కొడుతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై పెద్దల సభలో కేవీపీ రామచంద్రరావు ఒంటరి పోరాటం చేస్తున్నా... చిరంజీవి గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తర్వాత చిరంజీవి ఇంతవరకు ఒక్కరోజు కూడా హాజరుకాకపోవడం చూస్తుంటే... రాష్ట్ర సమస్యలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
కేంద బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యంలేదు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు, చిరంజీవి, సుబ్బరామిరెడ్డి ఏపీ నుంచి  కాంగ్రెస్‌ ఎంపీలుగా కొనసాగుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేవీపీ రామచంద్రరావు నిరసన తెలుపుతున్నా... చిరంజీవి మాత్రం బడ్జెట్‌ సమావేశాలకు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. 
పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోద సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి, రాష్ట్రానికి జరిగిన నష్టంపై అప్పట్లో ఒకసారి మాత్రమే నోరు విప్పారు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2012 ఏప్రిల్‌ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్‌  మంత్రివర్గంలో పర్యాటక శాఖ  బాధ్యతలు నిర్వహించారు. 2104 లోక్‌సభ ఎన్నికల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు హాజరుకావడం తగ్గించారు. అడపాడదపా హాజరైనా అదీ మొక్కుబడి తంతుగానే ముగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీలో చిరంజీవి రాజ్యసభ పదవీకాలం పూర్తవుతుంది. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో బాధ్యతాయుతమైన ఎంపీగా చిరంజీవి ఈ విషయాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. విభజన చట్టంలోని హామీల అమలు పెద్దల సభలో పోరాటం చేయాల్సిన సమయంలో గైర్హాజరవ్వడం విమర్శలకు తావిస్తోంది. 
రాజ్యసభ సమావేశాలకు చిరంజీవి హాజరైంది చాలా తక్కువ. 2017 బడ్జెట్‌ సమావేశాలకు 7 శాతం హాజరైన చిరంజీవి, శీతాకాల సమావేశాలకు 5 శాతమే హాజరయ్యారు. 2016 బడ్జెట్‌ భేటీకి 7శాతం, 2015 శీతాకాల సమావేశాలకు 30 శాతం, వర్షాకాల భేటీకి 5 శాతం హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత  2014లో తొలిసారి జరిగిన సమావేశాలకు 67 శాతం హాజరీ కనపరిచారు. ఇక రాజ్యసభలో చిరంజీవి వేసిన ప్రశ్నలు ఒక్కటి కూడా లేదంటే... రాష్ట్ర ప్రయోజనాలపై ఉన్న శ్రద్ద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 2014 జులై 14న ఏపీ విభజన చట్టంపై జరిగిన చర్చలో పాల్గొన్న చిరంజీవి, 2017 ఏప్రిల్‌ 5న మిజోరం సీఎస్‌ఎస్‌ హిందీ టీచర్ల పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీగా ఒక్క ప్రైవేటు మెంబర్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. కార్మిక శాఖపై ఏర్పాటైన  పార్లమెంటరీ స్థాయి సంఘంలో చిరంజీవి సభ్యుడు. కానీ ఒక్క సమావేశానికి కూడా హాజరుకాలేదు.
మంత్రిగా కేటాయించిన బంగ్లా ఖాళీకి నోటీసులు 
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన అక్బర్‌ రోడ్లులోని బంగ్లాను ఖాళీ చేయడానికి నిరాకరించినప్పుడు.. పట్టణాభివృద్ధి శాఖ నోటీసులతో బలవంతంగా  ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆతర్వాత రాజ్యసభ ఎంపీగా చిరంజీవి పురానా ఖిల్లా రోడ్డులోని ఏబీ-3 బంగ్లాను కేటాయించారు. కొద్ది రోజుల్లో రాజ్యసభ పదవీకాలన్ని పూర్తి చేసుకోబోతున్న చిరంజీవి, ఇప్పుడైనా సభకు హాజరై  కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన చట్టంలోని హామీల అమలుపై  నోరు విప్పుతారాలో .. లేదో .. చూడాలి. 

 

Related Posts