YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

గాలి మృతి పట్ల పలువురు సంతాపం

గాలి మృతి పట్ల పలువురు సంతాపం

 టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ముద్దుకృష్ణమనాయుడుకి  భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ వర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతీపురంలో ఉంటున్న ముద్దుకృష్ణమనాయుడు రెండురోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌ కేర్ ఆసుపత్రిలో చేరారు. 3 నెలల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా వెంకటరామాపురంలో జన్మించిన గాలి ముద్దుకృష్ణమనాయుడు బీఎస్సీ, ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టాను పొందారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. అటవీ, విద్య, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా ముద్దుకృష్ణమనాయుడు బాధ్యతలు నిర్వర్తించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయాన్ని పలువురు సందర్శించి  నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాసేపట్లో ముద్దుకృష్ణమ భౌతికకాయాన్ని విమానంలో తిరుపతికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ముద్దుకృష్ణమనాయుడి మరణం పార్టీకి తీరని లోటు : నామా 
గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం పార్టీకి తీరని లోటన్నారు టీడీపీ సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు. జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన గాలి ముద్దుకృష్ణమ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులర్పించారు నామా నాగేశ్వరరావు.
ముద్దుకృష్ణమ మరణం నన్నెంతో బాధించింది : జానారెడ్డి
గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం తననెంతో బాధించిందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. తాను ఒక ఆత్మీయుడిని కోల్పోయానని ఆయన చెప్పారు. ముద్దుకృష్ణమనాయుడి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు జానారెడ్డి. 

Related Posts