
కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య గతకొంతకాలంగా విభేదాలు నెలకొన్న వేళ ఆర్ బీఐ కీలక బోర్డు సమావేశం సోమవారం ప్రారంభమైంది. బోర్డు సమావేశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందిస్తూ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఉర్జిత్ పటేల్, ఆయన బృందం ప్రధాని మోదీకి తన స్థానమేంటో తెలియజేస్తారని ఆశిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు.‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన అధికారుల బృందం కలిసి దేశంలోని ప్రతి సంస్థను నాశనం చేస్తూ వస్తున్నారని, ఈ రోజు ఆర్‌బీఐ బోర్డులో తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో కలిసి రిజర్వ్ బ్యాంక్‌ను కూడా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పటేల్, ఆయన బృందం ప్రధాని మోదీకి తన స్థానమేంటో తెలియజేస్తారని ఆశిస్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. విభేదాల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వెలువడుతుండటంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.