YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

చేనేతను చితికేస్తున్న జీఎస్టీ

చేనేతను చితికేస్తున్న జీఎస్టీ
జీఎస్టీ అమలుతో చేనేత రంగంపై పన్నుపోటు పడింది. కేవలం చీరలపైనే కాకుండా అనుబంధంగా ఉన్న వాటిపై జీఎస్టీ అమలుకావడంతో చేనేతలు ఆధారం కోల్పోవలసి వచ్చింది. నూలుపై 5శాతం, రంగులపై 18శాతం, రసాయనాలపై 18శాతం, తయారైన వస్త్రాలపై ఖరీదును బట్టి 5నుండి 12 శాతం జీఎస్టీని అమలు చేస్తున్నారు. దీని ఫలితంగా ఒక్కో చీరపై 40నుంచి 50 శాతం జీఎస్టీ పన్ను పడుతోందిచేనేత పరిశ్రమ జీఎస్టీతో తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోంది. ఇప్పటికే అనేక సంవత్సరాలనుంచి చేనేత కార్మికులు వృత్తికి దూరమవుతూ ఇతర వృత్తులలోకి వలసలు వెళ్తుతున్నారు. ఇతర ఉత్పత్తులకు ఒకే రకమైన జీఎస్టీ అమలవుతుంటే చేనేత వస్త్రాలపై విభిన్న రకాల జీఎస్టీ అమలవుతున్నాయి. చిలపనూలు నుంచి రంగు, రసాయనాలపై తయారైన వస్త్రాలపై జీఎస్టీ విధిస్తున్నారు. అంటే చేనేత మగ్గంపై తయారు చేసే వస్త్రాలపై 40నుంచి 50 శాతం వరకు జీఎస్టీ పడుతోంది. దీని ప్రభావం కారణంగా జిల్లాలో ఇప్పటికే 25 శాతం మగ్గాలు మూలనపడ్డాయని చేనేతలు చెబుతున్నారు. జిల్లాలో 20 వేల చేనేత మగ్గాలు ఉన్నాయి. చీరాల, వేటపాలెం,కనిగిరి, మార్టూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 50వేల నుంచి 70 వేల మంది ఈ వృత్తినే నమ్ముకుని ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో అత్యధిక మంది చీరాల నియోజకవర్గంలోనే ఉన్నారు. రోజుకు జిల్లాలోని చేనేతలు సరాసరి 1లక్ష మీటర్ల చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేస్తుంటారు. అందులో 70 శాతం వస్త్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. సాధారణ దుస్తులు, ఊలు చీరలు, పంజాబీ దుస్తులు మొదలగు అత్యంత నాణ్యమైన జాకార్డు రకాలైన కుప్పడం, ఆల్ ఓవర్, బిట్‌సెల్ఫ్, బిట్‌కట్‌తో పాటుగా పట్టు చీరలు, కాటన్ పట్టు వస్త్రాలను మన రాష్ట్రంలోని పేరెన్నికగన్న ప్రాంతాలతోపాటుగా, ఇతర రాష్ట్రాలలోని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ప్రధాన ప్రాంతాలకు చీరాలనుండి చేనేత వస్త్రాలను ఎగుమతి చేస్తుంటారు. కుప్పడం వంటి చీరలకు భౌగోళిక గుర్తింపు లభిస్తుంది. బహుళ పన్నుల కారణంగానే చాలామంది మాస్టర్ వీవర్లు, కార్మికులు చేనేత రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. చేనేత రంగం రోజురోజుకు కుదేలవుతున్నా చేతి వృత్తులపై భారీ స్థాయిలో జీఎస్టీ, బహుళ పన్నుల కారణంగా తాము పూటగడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కార్మికులు వాపోతున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని మినహాయింపు ఇవ్వకపోతే చేనేత రంగం కనుమరుగయ్యే ప్రమాదం పొంచివుందని అంటున్నారు. కేంద్రప్రభుత్వం దేశం అంతా ఒకే పన్ను విధానం లాగా చేనేత వస్త్రాలపై బహుళ రూపంలో 40నుంచి 50 శాతం జీఎస్టీ రూపంలో పన్ను వసూలు చేస్తోంది. ఇందులో రాష్ట్రానికి తిరిగి ఇవ్వాల్సిన వాటాను అందిస్తోంది. చేనేతలకు జీఎస్టీ అమలు తర్వాత నూలు బారుకు రూ. 100 పెరిగింది. జీఎస్టీకి ముందు బారుకు రూ. 940లు ఉన్న ధర జీఎస్టీ అమలు తర్వాత రూ. 1040లకు పెరిగింది. పట్టు కిలో జీఎస్టీకి ముందు రూ. 4300, జీఎస్టీ తర్వాత రూ. 4800. పట్టు చీర జీఎస్టీకి ముందు రూ. 2800. జీఎస్టీ అమలు తర్వాత రూ. 3000. బిట్‌సెల్ఫ్ చీర జీఎస్టీకి ముందు రూ. 1800, జీఎస్టీ అమలు తర్వాత రూ. 1950లు. కుప్పడం జీఎస్టీకి ముందు రూ. 3750లు. జీఎస్టీ అమలు తర్వాత రూ. 4050లు. ఇంతే కాకుండా తయారైన చీరపై 12శాతం పెరిగింది. అదేవిధంగా రంగు, రసాయనాలపై 18శాతం పెరిగింది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ అమలు ఎత్తివేయాలంటూ చేనేత నాయకులు, కార్మికులు అనేక పోరాటాలు చేస్తూ కేంద్రప్రభుత్వం చేస్తున్న అమలును నిరసిస్తున్నారు. జీఎస్టీ విధానంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని నాయకులు, కార్మికులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

Related Posts