YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ తెరపైకి టీడీపీ, కాంగ్రెస్ పొత్తు

 మళ్లీ తెరపైకి టీడీపీ, కాంగ్రెస్ పొత్తు
తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. రెండు నెలల పాటు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజాకూటమికి కేవలం 21 స్థానాలే దక్కాయి. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది సీనియర్లు ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఆ పార్టీలోని ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటూ చెప్పుకున్న చాలా మంది నేతలు ఘోర పరాభవాన్ని చవి చూశారు. జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌, కొండా సురేఖలకు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు. ఇటు టీడీపీ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వర్రావు, రేవూరి ప్రకాశ్‌ సహా పలువురు నేతలకు గట్టి షాక్ తగిలింది. దీంతో కాంగ్రెస్-టీడీపీ పొత్తు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ రెండు పార్టీల పొత్తును తెలంగాణ ప్రజలు సమర్ధించలేదనే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు చంద్రబాబు.. తెలంగాణలో పర్యటించడం వల్లే ప్రజాకూటమి ఓడిపోయిందని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో వాదన హైలైట్ అవుతోంది.ఇటు తెలంగాణలో.. అటు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయి. అయితే, త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి తర్వాత దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు, పలువురు మంత్రులు ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ‘‘తెలంగాణలో అక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. ఏపీలో మాత్రం పొత్తు ఉండదని నేను మొదటి నుంచి చెబుతున్నా. తెలంగాణ ఫలితాలు వ్యక్తిగతంగా నాకు సంబంధం లేదు. ఎవరైనా సరే ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే’’ అన్నారు. అయితే, ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం పొత్తు కావాల్సిందే అంటున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ‘‘తెలంగాణ సెంటిమెంట్‌ ఆ రాష్ట్రంలో ఇంకా ఉంది. ప్రజలు సెంటిమెంట్‌కే పట్టం కట్టారు. ఓటమిని అంగీకరించాల్సిందే. ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుంది. జాతీయ స్థాయిలో దాదాపుగా పొత్తులు ఖరారయ్యాయి’’ అని అన్నారు.

Related Posts