YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అలీ దారెటనేది సస్పెన్స్‌

అలీ దారెటనేది సస్పెన్స్‌
 అలీ రాజకీయ ఆరంగేట్రం సర్వత్రా చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో భేటీ కావటంతో ఈ నెల 9న ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో అలీ భేటీ కావటం కలకలం రేపుతోంది. తొలుత టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి నివాసంలో అలీ భేటీ అయి సంచలనం రేకెత్తించారు. సుమారు అరగంట సేపు ఇద్దరు చర్చించారు. టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటును అలీకి ఆఫర్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మోదుగుల వేణుగోపాలరెడ్డికి ప్రత్యామ్నాయంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని అప్పగించి ఆ సీటు అలీతో భర్తీ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వాదనను టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇక మరోవైపు జిల్లాలవారీ సమీక్షలో నిమగ్నమైన పవన్‌కల్యాణ్‌తో విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో అలీ రెండు గంటల సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. జనసేనలో చేరాల్సిందిగా పవన్ ఆయనను ఆహ్వానించినట్లు తెలిసింది. దీంతో వైసీపీలో చేరికకు బ్రేక్ పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన పవన్‌తో ఏకాంత చర్చలు జరపటం హాట్‌టాపిక్‌గా మారింది. జనసేనలో చేరితే రాజకీయంగా అండగా ఉంటాన  ని పవన్ అలీకి హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, మారుతున్న రాజకీయ సమీకరణలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పవన్, ఆలీకి ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. పవన్‌ను ఆయన కలుసుకున్న సందర్భాలనేకం ఉన్నాయి. ఇదికూడా అలాంటి కలయికే అని పైకి చెప్తున్నా, జనసేనలో చేరే అంశంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఒకేరోజు కొద్ది గంటల వ్యవధిలో రెండు పార్టీల అధినేతలతో చర్చలు జరిపిన అలీ దారెటనేది సస్పెన్స్‌గా మారింది. వరుస భేటీలపై మీడియా ప్రశ్నించగా.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ను కలిసినట్లు అలీ ముక్తసరిగా సమాధానమిచ్చారు.

Related Posts