YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇక ఇంజనీరింగ్ తరహాలనే డిగ్రీ ఫీజులు

 ఇక ఇంజనీరింగ్ తరహాలనే డిగ్రీ ఫీజులు

రాష్ట్రంలో ప్రయివేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ఆగడాలకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి చెక్‌ పడనుంది. రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఓ విద్యార్థికి సీటు కేటాయించగానే ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తేనే చేర్చుకుంటామని కొన్ని ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని చెప్పినా విద్యార్థులను చేర్చుకోవడం లేదు. ముందు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని, ఒకవేళ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తే అప్పుడు తీసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఫీజు కడితేనే సీటు లేదంటే ఉండదు అన్న ధోరణిని కొన్ని ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు అవలంబిస్తున్నాయి. ఈ ధోరణికి స్వస్తి పలకాలని దోస్త్‌ అధికారులు భావిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2019-20) నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు తీసుకోవాలని అధికారులు సమాలోచన చేస్తున్నారు. ఇంకోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం వర్తించే విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రమే ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధానం ప్రస్తుతం ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తున్నది. ఆ విధానాన్ని డిగ్రీ ప్రవేశాలకూ వర్తింపచేయాలని అధికారులు సమాలోచన చేస్తున్నారు. డిగ్రీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో అనుసరించే విధానాలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో 2016-17 విద్యాసంవత్సరం నుంచి దోస్త్‌ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. ఇక నుంచి డిగ్రీ ప్రవేశాలు సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రయివేటు కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సమాలోచన చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్‌ ఫీజు అడిగే పద్ధతిని మార్చాలని భావిస్తున్నారు. ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. విద్యార్థులు కాలేజీలకు ట్యూషన్‌ ఫీజు రూపంలో ఒక్క రూపాయి చెల్లించే అవకాశం ఉండదు. కేవలం విద్యార్హత ధ్రువపత్రాలను జిరాక్స్‌ ప్రతులను మాత్రమే కేటాయించిన కాలేజీల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే ఆ కాలేజీ అడ్మిషన్‌ ఫీజు చెల్లించి సీటును రిజర్వు చేసుకోవచ్చు. ఇదే విధానం ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో అమలవుతున్నది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం ఉన్న విద్యార్థులు ప్రయివేటు కాలేజీల్లో సీటు వచ్చినా ట్యూషన్‌ ఫీజు చెల్లించే స్థోమత లేక కాలేజీ మార్చుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక నుంచి ఆ అవసరం ఉండబోదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇంకోవైపు దోస్త్‌ తొలివిడతలో మొదటి ప్రాధాన్యత ఇచ్చిన కాలేజీల్లోనే విద్యార్థులు తప్పనిసరిగా చేరాలన్న నిబంధన ఉంది. కాలేజీ, కోర్సు నచ్చకపోయినా మరో విడతల్లో మార్చుకునేందుకు అవకాశం లేదు. ఈ నిబంధనపైనా విద్యార్థుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. అందుకే ఈ నిబంధనను సవరించాలని దోస్త్‌ అధికారులు భావిస్తున్నారు. తొలివిడతలో మొదటి ప్రాధాన్యతలో సీటు వచ్చినా తర్వాతి విడతల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నారు.విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. డిగ్రీ ప్రవేశాలు సజావుగా జరిగేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దోస్త్‌ సమావేశంలో చర్చించి పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకుంటామని లింబాద్రి అన్నారు.

Related Posts