YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆపరేషన్ కమల్...ఫెయిల్యూర్ స్టోరీ

ఆపరేషన్ కమల్...ఫెయిల్యూర్ స్టోరీ

కర్ణాటకలో కమలం ఆపరేషన్ ఎందుకు ఫెయిలయింది? కాంగ్రెస్ నుంచి వస్తామన్న ఎమ్మెల్యేలు ఎందుకు కమలం గూటికి చేరలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం విధించిన షరతులతోనే ఎమ్మెల్యేలు రాలేదా? అవును ఇప్పుడు ఇదే చర్చ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతోంది. సంక్రాంతి పండగ తర్వాత కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ను కూల్చివేస్తామని బీజేపీ నేతలు బీరాలు పోయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్ లో ఉంచిన కమలం పార్టీ ఆపరేషన్ కమల్ ను షురూ చేసింది.స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్. శంకర్, హెచ్. నగేశ్ లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహ రించుకోవడంతో కర్ణాటకలో హైడ్రామా మొదలయింది. కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లారన్న వార్తలు కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేశాయి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం మాట్లాడారు. వారి అభిప్రాయాలను సేకరించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు పదవుల పందేరంపై ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడానికి అమిత్ షా సుముఖత వ్యక్తం చేయలేదు. కాంగ్రెస్ నేత రమేష్ జార్ఖిహోళికి వచ్చే లోక్ సభ ఎన్నికల్ల పార్లమెంటు సీటు ఇస్తామని కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. దీంతో మంత్రి పదవిని ఆశించిన రమేష్ జార్ఖిహోళి మనసు మార్చుకున్నారు. బీజేపీలో చేరినా ఫలితం ఉండదని ఆయన భావించారు. అసంతృప్త ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భీమా నాయక్, గణేశ్, బసవరాజు, ఉమేశ్ జాదవ్ ల పరిస్థితి అంతే. వీరికి బీజేపీ నాయకత్వం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో వారు బీజేపీలో చేరే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీనికి తోడు కుమారస్వామి, సిద్ధరామయ్యలు కట్టుదిట్టంగా తమ ఎమ్మెల్యేలను కాపాడుకున్నారు.ఆపరేషన్ కమల్ ను ప్రారంభించి…సక్సెస్ చేయడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి విఫలమయ్యారు. కేంద్ర నాయకత్వానికి, యడ్యూరప్ప కు మధ్య కెమిస్ట్రీ కుదరకపోవడమే దీనికి కారణం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగానే యడ్యూరప్ప సీఎం పదవిని అందుకోవాలని ఆరాటపడ్డారు. లోక్ సభ ఎన్నికలకు ముందు సంకీర్ణ సర్కార్ ను కూలదోస్తే దాని ప్రభావం ఎన్నికలపై ఉంటుందని భావించిన అమిత్ షా అందుకు సుతారమూ అంగీకరించలేదని తెలిసింది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడంతో యడ్డీకి కాలం కలిసి రాలేదు. మొత్తం మీద కర్ణాటకలో ఆపరేషన్ కమల్ మరోసారి విఫలమయింది. దీనికి యడ్యూరప్ప తొందరపాటే కారణమని చెప్పకతప్పదు. కమలం పార్టీ నవ్వులపాలయిందన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.

Related Posts