YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ముఖ్యమంత్రులు..విమర్శల జోరు..

 ముఖ్యమంత్రులు..విమర్శల జోరు..

ఇటీవలిగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ నేరుగా ఒకర్నొకరు విమర్శించుకుంటున్నారు. ఇతర పార్టీలతో ప్రత్యర్ధి పక్షం చేస్తున్న ఫ్రెండ్ షిప్ లపై దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇరు పార్టీల విమర్శల జోరు సామాన్యులనే కాక వివిధ రాజకీయవర్గాలనూ అయోమయానికి గురిచేస్తోంది. టీడీపీ, టీఆర్ఎస్ లు ఇంతగా ద్వంద ధోరణి పాటించడమేంటని పలువురు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీడీపీ చేయని ప్రయత్నం లేదు. ఏకంగా బద్ధశత్రువు కాంగ్రెస్ తో జట్టుకట్టింది. అంతేనా ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు జోరుగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటికే కాంగ్రెస్ ను తనదైనశైలిలో జాడించేసిన కేసీఆర్ టీడీపీనీ టార్గెట్ చేశారు. చంద్రబాబును ఆంధ్ర రాక్షసిగా అభివర్ణించారు. ఏదైతేనేం ఫైనల్ గా ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. గెలిచిన రోజునే కేసీఆర్ చంద్రబాబును విమర్శించడంతో పాటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ తన మనసులో మాట బయటపెట్టేశారు. ఆంధ్ర రాజకీయాల్లో కల్పించుకుంటామని తేల్చి పడేశారు. ఇప్పుడిదే ప్రోగ్రామ్ ను ముమ్మరం చేశారు గులాబీ బాస్. బీజేపీ, కాంగ్రెస్ లేని మూడో రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చాలా కాలం క్రితమే స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చి ఈ పక్షాన్ని బలోపేతం చేసే పని ప్రారంభించారు. రాష్ట్రాలు అభివృద్ధిలోకి రావాలన్నా.. స్థానిక సమస్యలు పరిష్కృతం కావాలన్నా జాతీయ పార్టీలు లేని కూటమి పటిష్టం కావాలన్నది కేసీఆర్ మాట. ఆయన ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధాన విపక్షం వైసీపీ మద్దతుకూ కేసీఆర్ యత్నించారు. 

కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ పై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీపై టీడీపీ అగ్గిమీద గుగ్గిలమే అయింది. ఆ పార్టీ నేతలు కొందరు ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదని ప్రధాని మోడీకి ఫిడేల్ వాయించే పక్షమని విమర్శించారు. ఇక చంద్రబాబు అయితే తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ తో వైసీపీ ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. వైసీపీ రాష్ట్ర సంక్షేమాన్ని విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకుళ్లాడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధ్యక్షుడు జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అసూయపరులంతా ఏకమై కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ చెబుతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందన లేదని, అందుకే కేటీఆర్‌ హడావుడిగా జగన్‌తో భేటీ అయ్యారని అన్నారు. ఈ చర్యతో టీఆర్ఎస్, వైసీపీ ఒక్కటేననే విషయం మరోసారి స్పష్టమైందని, వారి ముసుగు తొలగిపోయిందని దుయ్యబట్టారు. నిన్నమొన్నటివరకూ బీజేపీతో అంటకాగి.. ఇప్పుడు కాంగ్రెస్ తో జట్టుకట్టడమేంటని టీఆర్ఎస్, వైసీపీలు టీడీపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కాంగ్రెస్ తో చేయి కలిపారని అంటున్నాయి. ఇక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలపై జగన్ ప్రశంసలు కురిపించారు. పార్లమెంట్ లో తెలుగురాష్ట్రాలు బలం పెరిగితే హామీలు అమలు అయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలమని అన్నారు. ఇరు పార్టీల కామన్ టార్గెట్ టీడీపీనే. ఈ నేపథ్యంలో తెలుగుదేశంపైనే తరచూ విరుచుకుపడుతున్న వైసీపీ, టీఆర్ఎస్ లు బీజేపీని పెద్దగా విమర్శించడంలేదు. ఇదే విషయాన్ని టీడీపీ హైలెట్ చేస్తోంది. టీఆర్ఎస్, వైసీపీలు బీజేపీతో జట్టు కట్టాయని అంటోంది. 

Related Posts