YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈవీఎంల వినియోగంపై ప్రజల్లో అనుమానాలున్నాయి

ఈవీఎంల వినియోగంపై ప్రజల్లో అనుమానాలున్నాయి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఈసీ విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఎక్కడా వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించలేదని ఆయన ఆరోపించారు. ఈవీఎంలపై అనుమానం వచ్చి ఓట్ల లెక్కింపు రోజే తమ అభ్యర్థులందరికీ మెసేజ్‌లు పంపామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాంతో పాటు కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో నూరుశాతం వీవీప్యాట్‌లు లెక్కించారని చెప్పారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరించకుండా ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఎక్కువ మంది ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఓటర్ల నమోదులో ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికపై అంతగా అవగాహన లేదని.. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని చెప్పారు.తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ వేలాది గ్రామాల్లో బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే పంచాయతీ ఎన్నికలు జరిగాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఆరోపణలు రాలేదని చెప్పారు. ఫోన్లు, ఈవీఎంల ట్యాంపరింగ్‌నే కేసీఆర్‌ నమ్ముకున్నారని రమణ ఆరోపించారు. ఎన్నికల్లో ఈవీఎంలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటుహక్కు ఉండాలని.. తెలంగాణలో మాత్రం 22 లక్షల మందికి ఓటుహక్కు లేదన్నారు. పోలైన ఓట్లకు.. లెక్కించిన ఓట్లకు తేడా ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఓటు కూడా తేడా రాకూడదని.. అలాంటిది 31 నియోజకవర్గాల్లో తేడాలొచ్చాయని చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెరాస ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలున్నాయన్నారు.

Related Posts