
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు తీసుకురావటం కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటని, అదే తమకు కలిసొచ్చే అంశం బాగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చివరకు ఎన్నికల ఫలితాలు చూసి ఖంగుతింది. టీఆర్‌ఎస్ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించి కొత్త ఉత్సాహంలో మునిగిపోతే.. మహాకూటమి మాత్రం మాయలో పడిపోయింది. అన్ని పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా కాంగ్రెస్ పార్టీకి కలిసిరాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికార భవనం గాంధీ భవన్ వాస్తు బాగాలేదని, కాంగ్రెస్ కి కాలం కలిసిరాలేదని ముందుగా చాలా వార్తలు బయటకొచ్చాయి. ఇక తాజాగా పార్టీని ప్రక్షాళన చేస్తూ.. ప్రస్తుతం పార్టీకి పట్టిన దుమ్ము దులిపేయాలని వ్యూహం రచించే పనిలో పడ్డారట కాంగ్రెస్ పెద్దలు. ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించాలని నిర్ణయం తీసుకున్నారట.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ని పూర్తి ప్రక్షాళన చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారట. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీం తోనే లోక్ సభ బరిలో కూడా దిగడం అంత మంచిది కాదని, అలా చేస్తే మరో పెద్ద తప్పు చేసిన వాళ్లమవుతామని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందట. దీంతో ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మొత్తం కార్యవర్గాన్ని మార్చాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారంతెలంగాణలో మాస్ లీడర్‌గా పేరొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా కూడా తనకు భారీ ఫాలోయింగ్ ఉందని, తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కోమటిరెడ్డి. తనకు టీపీసీసీ చైర్మన్ పదవిలో కూర్చోబెడితే 8 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించటం ఖాయం అని ఆయన అంటున్నారట. దీంతో ఆయన వైపు మొగ్గే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. మరోవైపు పీసీసీ రేసులో మాజీ మంత్రులు గీతారెడ్డి డీకే అరుణ సబితా ఇంద్రారెడ్డి లు కూడా ఉన్నారనే సమాచారం అందుతోంది. ఈ సారి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిలో మహిళను కూర్చోబెట్టాలనే కోణంలో కూడా అధిష్టానం ఆలోచనలు చేస్తోందట. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడం కారణంగా.. తెలంగాణ పీసీపీ చీఫ్‌గా కూడా మహిళనే తీసుకోవచ్చనే ఉహాగానాలూ వినిపిస్తున్నాయి. చూడాలి చివరికి ఏం జరగనుందో! ఎవరు ఆ సీట్లో కూర్చోనున్నారో! ఎన్ని సీట్లు తీసుకురానున్నారో!