
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మినీ సినిమా థియేటర్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ఆర్‌టిసి ఇకపైన పెట్రోల్ బంకులను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. రాష్ట్రం మొత్తం మీద ఆర్‌టిసికి ఉన్న భూములను సద్వినియోగం చేసుకుంటూనే వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన వాణిజ్య సముదాయాల నిర్మాణం దిశగా కూడా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆర్‌టిసి సంస్థ బస్సు ప్రయాణీకుల నుంచి టిక్కెట్ల రూపంలో, బస్టాండ్‌లలో దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా మాత్రమే ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఉంది. అయితే ఏటేటా సంస్థ నిర్వహణకు ఖర్చు ఎక్కువవుతుండడం, ఆదాయం అందుకనుగుణంగా సమకూరకపోవడంతో నష్టాల బాట పడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం వాణిజ్య లావాదేవీలపై దృష్టిపెట్టింది. నిరుపయోగంగా ఉన్న ఆర్‌టిసికి చెందిన భూములను కాసులు కురిపించేలా చేయడంపై అనేక సమావేశాల్లో చర్చలు జరగాయి. సంస్థను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన సమావేశంలో సంస్థ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో ప్రధానంగా పెట్రోల్ బంకులు, మినీ థియేటర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. థియేటర్ల నిర్మాణానికి రాష్ట్ర చలన చిత్ర మండలి కూడా ముందుకు వచ్చింది. ఇక ఖాళీగా ఉన్న ఆర్‌టిసి స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లను, కార్యాలయాలను, హోటళ్లను వినియోగించుకునేందుకు వీలుగా భవనాలను నిర్మించి అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది.ఆర్‌టిసికి సమకూరుతున్న ఆదాయంలో సింహాభాగం ట్రాఫిక్ రెవెన్యూ (టికెట్లు, రిజర్వేషన్లు) ద్వారా 83.5 శాతం మేర, వివిధ రకాల బస్సు పాసుల ద్వారా 14 శాతం సమకూరుతోంది. వాణిజ్యపరంగా కేవలం 2.5 శాతం మాత్రమే వస్తోంది. వాణిజ్యపరంగా వస్తున్న ఆదాయాన్ని కనీసంగా పది శాతానికి పెంచాలని భావిస్తోంది. డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లతో ఇటీవల జరిగిన సమావేశంలో దీనిపై లోతుగా చర్చించి నిర్దిష్ట లక్షాలను నిర్దేశించినట్లు తెలిసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించినట్లు సమాచార ం. ఆదాయాన్ని పెంచుకోడానికి వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను కూడా ఈ సందర్భంగా ఆర్‌టిసి ఎండి ఈ సమావేశంలో అధికార యంత్రాంగానికి వివరించినట్లు సమాచారం. దుబాయ్‌లో అయిల్ ద్వారా ఆ దేశానికి కేవలం ఒక శాతం మాత్రమే ఆదాయం సమకూరుతుందని, వాణిజ్యంతో పాటు పర్యాటక పరంగానే అత్యధిక రాబడి వస్తున్నట్లు అధికారుల కు వివరించినట్లు సమాచారం.సంస్థను ఆర్థికంగా అభివృద్ధి చేసుకునే దిశలో భాగంగా ఆదాపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బస్టాండ్ల నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ందుకు సిద్ధమైంది. 33 ఏళ్ల పాటు లీజుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో వీటి నిర్వహణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ముందు గా జూబ్లీ బస్ టెర్మినల్‌తో పాటు పాత గౌలిగూడలోని ఎంజిబిఎస్ బస్టాండ్‌ల నిర్వహణతో ప్రయోగాత్మంగా ప్రైవేటు సంస్థలతో కలిసి పనులను ప్రారంభించాలని వాటి నిర్వహణను ఆయన సంస్థలకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి లఖ్‌నపూర్‌లో అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. వీటి వల్ల సంస్థ రాబడి పెరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు సమాచారం.