
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఫిబ్రవరి తొలివారంలోగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని గవర్నర్‌కు కేసీఆర్ చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో అనుభవానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. తొలివిడత విస్తరణలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అయిన వారిలో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో ఆదివారందీనిపై కసరత్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితాలను తెప్పించుకుని, జిల్లాలవారీగా సామాజికవర్గాలు, ఇతర వివరాలను పరిశీలించినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ నేపథ్యం, సామాజిక సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుని క్యాబినెట్ రూపొందించారు. అయితే, ఈసారి గతానికి భిన్నంగా కూర్పు ఉండే అవకాశాలున్నాయి. ఈ మేరకు జాబితాను సిద్ధం చేసిన ముఖ్యమంత్రి, రెండు నుంచి ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, అందులోనూ తనకు విధేయులైన వారి పేర్లే మొదటి వరుసలో ఉన్నట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావులకు మళ్లీ మంత్రి పదవులు పక్కా అని అంటున్నారు. నిజామాబాద్ నుంచి ప్రశాంత్‌రెడ్డి లేదా బాజిరెడ్డి గోవర్ధన్, ఆదిలాబాద్ నుంచి రేఖానాయక్ పేరు వినిపిస్తోంది. ఎస్టీ, మహిళా కోటా రెండూ ఆమెకు కలిసిరానున్నాయి. అయితే, మెదక్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డికి అవకాశం దక్కితే రేఖానాయక్‌కు రిక్తహస్తమే. ఈ సందర్భంలో ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలలో ఎవరో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయిఇక, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి లేదా నిరంజన్‌రెడ్డి, నల్గొండ నుంచి జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్, రంగారెడ్డి నుంచి నరేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగరం నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్, వరంగల్ నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ విస్తరణలో భాగంగా తొలి విడత ఎనిమిది మందికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ నుంచి ఒక్కొక్కరికి, కరీంనగర్ నుంచి ఇద్దరికి తొలి విడతలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగతా పదవులు భర్తీ చేసి, అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు