
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తెలంగాణ సర్కార్ పలు చర్యలు తీసుకుంటోంది. ప్రజాసంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏళ్ల తరబడి సమస్యల్లో మగ్గుతున్న గిరిజన ప్రాంతాలను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మలచేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే లోని అన్ని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కూడా ఎజెన్సీ ప్రాంతవాసులపై దృష్టి పెట్టింది. వారి సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఐటీడీఏ ఆదివాసీ గిరిజన గూడాలు, తండాల్లో కొత్తగా 59 ‘దిశ ఆదర్శ పాఠశాలలు’ను ఏర్పాటు చేస్తోంది. ఈ పాఠశాలల ద్వారా 2082 మంది గిరిజన చిన్నారులకు నాణ్యమైన విద్యనందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇక బోధన నిమిత్తం నిష్ణాతులైన 168 మంది ఉపాధ్యాయులను నియమించనుంది. మొత్తంగా ఏజెన్సీ ప్రాంతంలోని పిల్లలకు ప్రాథమిక దశ నుంచే మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా రూ.రెండు కోట్ల వ్యయంతో ప్రయోగాత్మకంగా ఈ బడులను ఏర్పాటు చేస్తోంది. దిశ ఆదర్శ పాఠశాలల్లో ప్రజలకూ భాగస్వామ్యం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ పాఠశాలలు మనవే.. వీటిని అభివృద్ధి చేసుకుందాం.. పిల్లలను బాగా చదివించుకుందామనే ఆలోచనతో ప్రజల నుంచి సహాయ, సహకారాలను స్వీకరిస్తున్నారు సంబంధిత అధికారులు. దిశ పాఠశాలలకు ఏజెన్సీ వాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తమవంతు సహకారాన్ని అందించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ స్థానికులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. పిల్లలకు చదవుతో పాటూ గిరిజనులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు, వారి సంక్షేమానికి ఐటీడీఏ మరింతగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంతేకాక ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఏజెన్సీలో తిష్టవేసిన అనేక సమస్యలకు చెక్ పెట్టాలని, మౌలిక వసతులు కల్పించడంతోపాటూ వైద్య సేవలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.