
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శాసన మండలి ఓటుహక్కు నమోదుపై పట్టభద్రులు కొందరు ఆసక్తి చూపడం లేదన్న వార్తలు మంచిర్యాల జిల్లాలో వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఓటుహక్కు నమోదుకు గడువు సమీపిస్తోంది. ఈనెల 31 చివరితేదీ. అయినప్పటికీ సరైన స్పందన లేకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లాలోనే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో పట్టభద్రులు సంఖ్య 25,143గా ఉంది. ఉపాధ్యాయులు 2,921 మంది మాత్రమే ఓటర్లుగా నమోదైనట్లు సమాచారం. పలువురు ఓటుహక్కుకు దూరంగా ఉండడంపై ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. దీంతో ఎన్నికల కమిషన్ ఓటు నమోదుకు అక్టోబరు ఒకటో తేదీన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఓటు నమోదుకు నవంబరు 6వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. కానీ జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుంచి స్పందన పెద్దగా లేదు. ఈనెల ఒకటో తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కును కల్పిస్తూ తుదిజాబితాను విడుదల చేసింది ఈసీ.
ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో పట్టభద్రులు ఇప్పటివరకు 25,143మంది, ఉపాధ్యాయులు కేవలం 2921 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి ఫాం నెం.18, ఉపాధ్యాయులకు సంబంధించి ఫాం నెం.19 కింద ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే విద్యావంతుల నుంచి సరైన స్పందన లేకపోవడంపై విస్తుగొలిపే అంశం. యువతరం, ఉపాధ్యాయులు కదిలితే ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. చదువుకున్నవారే మండలి ఓటు నమోదుకు దూరంగా ఉండటం ఆందోళన కలిగించే పరిణామమని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. శాసన మండలి విద్యారంగంతో పాటు నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీలు ముందుంటారు. ఈ విభాగాల్లోని ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. అందుకే విద్యావంతులు, ఉద్యోగులు స్పందించి ఓటుహక్కు నమోదుకు ప్రాధాన్యతనివ్వాలని అంతా సూచిస్తున్నారు. శాసన మండలి ఓటుహక్కు నమోదుకు కొన్ని నియమాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్లు నవంబరు ఒకటి 2018నాటికి డిగ్రీ పట్టా పొందాలి. పట్టా తీసుకుని మూడేళ్లు నిండాలి. వీరు ఓటు హక్కు కోసం ఫాం18 ను సమర్పించాలి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటు వేయాలంటే 2012 నవంబరు ఒకటి నుంచి 2018 నవంబర్ ఒకటి నాటికి ఆరేళ్లల్లో మూడేళ్లు హైస్కూల్ ఆపై తరగతులకు బోధించేవారై ఉండాలి. వీరు ఫాం-19 సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఆన్‌లైన్‌లోనూ అవకాశముంది. ఓటరు నమోదుపై అధికార యంత్రాంగం విస్త్రృత ప్రచారం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయులు కూడా స్పందించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అంతా సూచిస్తున్నారు.