
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మూడో విడత పంచా యతీ ఎన్నికలకు అధికారు లు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగను న్నది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. అభ్యర్థులు ఇక పోలింగ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. గత 15 రోజులుగా చేపడుతున్న ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి గాను భారీగా డబ్బు, మద్యం, చీరలు పంపిణీ చేసినట్టు సమాచారం. చివరి పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 12,732 పంచాయతీల్లో ఇప్పటికే రెండు విడతలుగా ఎన్నికలు పూర్తవగా.. మిగతా 4,116 పంచాయతీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో 573 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,529 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ పదవి కోసం మొత్తం 11,667 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.వార్డుల పరిధిలో మొత్తం 36,729 వార్డు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీకాగా.. 8,956 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగత 27,583 వార్డులకు గానూ 67,316 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలలోని మూడు పంచాయతీల పరిధిలో నిలిచిపోయిన పలు వార్డులకు కూడా ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించి.. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో పోటీ పడుతున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మహిళలకు చీరలు, పురుషులకు మద్యం, నగదు పంపిణీ చేసినట్టు సమాచారం. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీల అగ్రనేతలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పంచాయతీ ఎన్నికల్లోనూ నగదు, మద్యం పంపిణీ జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.1.80 కోట్ల నగదు, రూ.36,27లక్షలు విలువ చేసే 1446 లీటర్ల మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి 200 కేసులు నమోదయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనవరి 1న షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నెల రోజుల పాటు గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడిక్కింది. ఈ నెల 30తో పంచాయతీ ఎన్నికలకు తెరపడనున్నది.
మొత్తం పంచాయతీలు .... 4116
ఏకగ్రీవమైన సర్పంచ్‌లు ... 579
ఎన్నికలు జరిగే పంచాయతీలు .. 3529
బరిలో నిలిచిన అభ్యర్థులు .. 11667