
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గ్రేటర్ హైదరాబాద్‌ను మూత్ర విసర్జన రహిత నగరం ++గా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. 2017 డిసెంబర్ మాసంలో హైదరాబాద్ నగరాన్ని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత నగరంగా స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించింది. ప్రస్తుత 2019కిగాను హైదరాబాద్ నగరం ఓడిఎఫ్ ++గా ప్రకటించడం ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో 200 మార్కులు హైదరాబాద్ నగరానికి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రత్యేకంగా కేటాయించనుంది. హైదరాబాద్ నగరాన్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ + (బహిరంగ మూత్ర విసర్జన రహిత నగరం +)గా ప్రకటించేందుకు జీహెచ్ఎంసి సమర్పించిన ప్రతిపాదనలపై స్వచ్ఛ భారత్ మిషన్‌కు చెందిన క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా సంస్థ థర్డ్‌పార్టీ బృందాలు జనవరి రెండవ వారంలో హైదరాబాద్ నగరంలో విస్తృతంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాయి. హైదరాబాద్ నగరంలో 271 పబ్లిక్ టాయిలెట్లు ఉండగా వీటిలో క్యు.సి.ఐ బృందాలు 18 టాయిలెట్లను ర్యాండమ్‌గా తనిఖీ చేశాయి. ఈ 18 పబ్లిక్ టాయిలెట్లలో పరిశుభ్రంగా ఒక టాయిలెట్, ఎక్సలెంట్‌గా 12 టాయిలెట్లు, మరో 5 టాయిలెట్లు అద్బుతంగా నిర్వహిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా బీరప్పగడ్డ, కూకట్‌పల్లి వివేక్‌నగర్, మీ-సేవా కాంప్లెక్స్, బీ.ఆర్.కే భవన్, మాదాపూర్ పీ.ఎస్‌లలో ఉన్న టాయిలెట్లు అత్యంత మెరుగైన పద్దతిలో నిర్వహిస్తున్నారని వెల్లడించారు. వీటితో పాటు నగరంలోని కాలనీ సంక్షేమ సంఘాలు తమ కాలనీల్లో సక్రమంగా నిర్వహించే పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయని ఇచ్చిన డిక్లరేషన్, నగరంలోని అన్ని కమ్యునిటీ టాయిలెట్లు పబ్లిక్ టాయిలెట్లు, వ్యక్తిగత టాయిలెట్లు అన్ని సక్రమంగా ఉన్నాయని సంబంధిత వార్డు ఇంజనీర్లు ఇచ్చే డిక్లరేషన్, తమ పరిధిలో పబ్లిక్ టాయిలెట్లు పూర్తిస్థాయిలో తమకు అందుబాటులో ఉన్నాయని స్థానిక స్వయం సహాయక బృందాల మహిళలు, కమర్షియల్ ప్రాంతాల్లో టాయిలెట్లు అందుబాటులో ఉన్నట్టు నగరవాసులు ఇచ్చిన డిక్లరేషన్‌లను కూడా ఈ బృందాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి. నగరంలో గతంలో ఉన్న బహిరంగ మూత్ర విసర్జన ప్రదేశాల వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, మూత్ర విసర్జన చేయకుండా గట్టి నిఘా ఉంచడం, నిబంధనలు అతిక్రమించి మూత్ర విసర్జనచేసే వారికి భారీగా జరిమానాలు విధించడం, లాఠీ, సిటీ కార్యక్రమం, పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా నిర్వహించడం తదితర చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.