
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణలో గ్రామ పంచాయతీ తుది విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం 3,529 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మూడో విడతలో 29 జిల్లాల పరిధిలో 166 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేసేందుకు సీసీ కెమెరాలు, ప్రత్యక్ష ప్రసారాల కోసం సాంకేతిక ఏర్పాట్లను ఈసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 7,043 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా... బుధవారం జరిగే పోలింగ్‌తో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మూడో విడత బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రంతో గడువు ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రహస్య మంతనాలు సాగిస్తున్నారు. వారిని ప్రలోభపెట్టేందుకు నగదుతో పాటు ఇతరత్రా అవసరాలను ఎర వేస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులిస్తామని ప్రకటించడంతో చాలామంది నాయకులు సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసేందుకు తుదివరకు ప్రయత్నించారు. చాలా గ్రామాల్లో అభ్యర్థులు పోటీ నుంచి తొలగేందుకు ససేమిరా అనడంతో పోటీ తప్పనిసరి అయింది. మరోవైపు కొన్నిచోట్ల లక్షల రూపాలకు పదవులను వేలంలో పాడుకుని ఏకగ్రీవం చేసుకోగా, మరికొన్నిచోట్ల అభ్యర్థులు ప్రత్యర్థులకు భారీగా ముట్టజెప్పి పోటీ నుంచి వైదొలగేలా చేసుకున్నారు. తుది విడతలో మొత్తం 573 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 61, ఆసిఫాబాద్‌లో 55 పంచాయతీలు ఈ జాబితాలో ఉన్నాయి