
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆఖరి విడత పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. నల్గొండ డివిజన్ తో పాటు రాజధానికి దగ్గరలో ఉన్న చౌటుప్పల్ డివిజన్, సూర్యపేట జిల్లా కృష్ణ పట్టె ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మొదటి రెండు విడతలతో పోలిస్తే మూడో విడత పంచాయితీ పోరు హోరా హోరీగా జరిగింది. అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతకు సాయుధ బలగాలను ఉపయోగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 మండలాలలో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో 257 పంచాయతీలకు గాను 16 ఏకగ్రీవం కాగా 241 పంచాయతీలకు ఎన్నికలు కొనసాగాయి. అదేవిధంగా సూర్యపేట జిల్లాలో 154 పంచాయతీలకు గాను 9 ఏకగ్రీవం కాగా 145 పంచాయతీలకు,యాదాద్రి జిల్లాలో 148 పంచాయతీలకు 21 ఏకగ్రీవం కాగా 126 పంచాయతీలకు తుది విడత పంచాయితీ ఎన్నికలు జరిగాయి. . నల్గొండ,యాదాద్రి జిల్లాల్లో రాష్ట్ర రాజధానికి సమీపంలో జాతీయ రహదారి వెంట ఉన్న మండలాల్లో రియల్ వెంచర్లు, పరిశ్రమలు ఉండడంతో సమీప గ్రామాల సర్పంచ్ పదవి కి గట్టి పోటీ ఉంది. ఒక్కో గ్రామానికి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి పోటీలో నిలిచారు.