
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం చివరి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లాలోని కోనరావుపేట, తంగళ్ళపల్లి , ఇల్లంతకుంట మండలాల పరిధిలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గ్రామీణ ఓటర్లు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. . ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా బుధవారం పోలింగ్ సరళిని జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాషా, జిల్లా రెవిన్యూ అధికారి ఖీమ్యా నాయక్ పరిశీలించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ , మండేపల్లి గ్రామంలోని పాటశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఇంచార్జీ కలెక్టర్ సందర్శించి పోలింగ్ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు జారీ చేసారు. పోలింగ్ శాతం ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు .
కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్
ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 02.00 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రిటర్నింగ్ అధికారులు ,ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు . ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు చేపట్టి ..అనంతరం సర్పంచ్ ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు . సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టారు.