
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నల్లమల ప్రాంతంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. తరచూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ప్రధానంగా ఘాట్‌రోడ్డు మలుపులు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. బుధవారం అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన గిరిజనుల కట్టెల ట్రాక్టర్ దారవాపు ఘాట్ మలుపు వద్ద బోల్తాపడి ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురు క్షతగాత్రులై ఆసుపత్రి పాలైన విషయం విధితమే. ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకొంటున్నా నివారణ చర్యలు మాత్రం శూన్యం. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు శ్రీశైలం, మద్దిమడుగు పుణ్య క్షేత్రాలకు వెళ్తుంటాయి. వేలాది మంది ప్రయాణిస్తుంటారు.
మహబూబ్‌నగర్ నుంచి వెళ్లే మార్గంలో రంగాపూర్ దాటాక కుంచోని మూల వద్ద, హైదరాబాద్ నుంచి వచ్చే మార్గంలో బ్రాహ్మణపల్లి దాటాక ప్రతాపరుద్రుని కోట నుంచి ఘాట్ రోడ్డు ప్రారంభమవుతోంది. ఇక్కడి నుంచి 90 కిలో మీటర్ల మార్గంలో పలుచోట్ల ప్రమాదకరమైన మలుపులతో కూడిన ఘాటురోడ్డు ఉంటుంది. గతంలో ఈ రహదారి మరమ్మతు పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టేవారు. ఇప్పుడు జాతీయ రహదారి అధికారుల పరిధిలో ఉంది. పదేళ్ల కిందట చేపట్టిన మరమ్మతు పనులు తప్ప ఇప్పటి వరకు మళ్లీ పట్టించుకోలేదు. మన్ననూరు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు వరకు పలుచోట్ల రోడ్డు గుంతలు పడింది.
రహదారి విస్తరణ తప్పనిసరి అయినప్పటికీ అటవీశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయి. హైదరాబాద్ నుంచి అచ్చంపేట మండలం ఐనోల్ చౌరస్తా సమీపంలోని ఘాట్ వరకు రెండేళ్ల కిందటే రోడ్డు విస్తరణ పూర్తి చేశారు. రోడ్డుకిరువైపులా చెట్లను తొలగించరాదన్న వైల్డ్‌లైఫ్ నిబంధనతో అక్కడితోనే పనులు ఆపేశారు. విస్తరణకు అవకాశం లేకున్నా.. కనీసం ఉన్న రహదారిని బాగు చేసి ప్రమాదాలు నివారించ వచ్చు. మన్ననూరు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు వరకు చాలా చోట్ల ప్రమాద మలుపుల వద్ద ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డులు శిథిలమై తొలగిపోయాయి. వాహనాలు ఒక్కసారిగా ఎదురుపడితే వాహన చోదకులు వేగాన్ని నియంత్రించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
రంగాపూర్ నుంచి మన్ననూరు వెళ్లే కుంచోని మూల ఘాట్, ప్రతాపరుద్రుని కోట వద్ద మలుపు, లింగమయ్య ఆలయ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు, దారావాగు వద్ద ఘాట్ మలుపు, అంజమాన్ పహాడ్ ఘాటురోడ్డు, డబ్బ చెలిమ, బొంగులోని ఉతారు, వటవర్లపల్లి నుంచి వెళ్లే మార్గంలో రాసమల్లోని బావి దాటక ఉన్న మలుపు, కదిలి వనం వెళ్లే ఘాట్‌రోడ్డు మలుపు, అక్టోపస్ దృశ్య కేంద్రానికి ముందు గల ఘాట్‌రోడ్డు మలుపులు అతి ప్రమాదకంగా ఉన్నాయి. రంగాపూర్ నుంచి మన్ననూరు మధ్యలో ఘాట్‌రోడ్డు రక్షణగోడ కూలినా మరమ్మతులు లేవు. ఉన్న రోడ్డునే వాహనాలు సజావుగా వెళ్లేలా మరమ్మతు పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. వచ్చే మహాశివరాత్రికి వేలాదిగా వాహనాలు శ్రీశైలం తరలివెళ్తాయి. అప్పటి వరకైనా ఘాట్‌రోడ్లలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి.