
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సులభతర వాణిజ్యం 2019 కి సంబంధించి 80 సంస్కరణల కి గాని 60 సంస్కరణలు పూర్తి చేసినందుకు వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి అభినందించారు. గురువారం సచివాలయంలో సులభతర వాణిజ్యం యాక్షన్ ప్లాన్ 2019 పై సి.యస్ డా. ఎస్.జోషి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారి, ముఖ్యకార్యదర్శులు శాంతికుమారి, జయేష్ రంజన్, సునీల్ శర్మ, శశాంక్ గోయల్, వికాస్ రాజ్, పరిశ్రమల శాఖ కమీషనర్ నదీమ్ అహ్మద్, పిసిసిఎఫ్ పి.కె.ఝా, పిసిబి సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ సంస్కరణలు పూర్తిచేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ,ఫ్యాక్టరీస్, డ్రగ్స్, ఇంధనం, జిఎస్ టి, ఎక్సైజ్, ఫైర్, హెచ్ఎండిఏ, ట్రాన్స్ పోర్టు, ఐజీఆర్ ఎస్ తదితర శాఖలను అభినందించారు. మిగిలిన 20 సంస్కరణల కు సంబంధించి ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో అమలు చేసిన సంస్కరణల పై వినియోగదారులనుంచి నుండి అభిప్రాయ సేకరణకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ విషయమై పరిశ్రమల శాఖ ద్వారా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా పరిశ్రమలకు అనుమతులు పొందిన వారితో ప్రత్యేకంగా సమావేశం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదించాలన్నారు. ఏవైనా సమస్యలు దృష్టికి వస్తే పరిష్కరించాలన్నారు. గత సంవత్సరం మెరుగైన ప్రతిభను ప్రదర్శించామని అదే స్పూర్తిని కొనసాగించాలన్నారు.
పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ మిగిలిన 20 సంస్కరణల లో 10 సంస్కరణలు ఒకటి కంటే ఎక్కవ శాఖలకు సంబంధించినవని అన్నారు. సంస్కరణలను అమలు చేయడం, సాక్షాలను చూపడం కేవలం అర్హత అని, అభిప్రాయసేకరణ పైనే ర్యాంకింగ్ ఉంటుందని అధికారులకు తెలిపారు. ప్రభుత్వం ద్వారా వివిధ అనుమతులు పొందిన వారితో సంస్కరణలపై అభిప్రాయ సేకరణ పై ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు.