YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతన్నకు అండగా పంటకాలనీలు..

రైతన్నకు అండగా పంటకాలనీలు..
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్రంలో నీటి వనరులు మెరుగుపరచేందుకే కాక రైతాంగానికి ఉపయుక్తంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలుచేస్తోంది. ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చెరువులు తవ్విస్తోంది. ఉన్న చెరువులను పునరుద్ధరిస్తూ జలాలు ఒడిసిపడుతోంది. ప్రభుత్వ కృషి ఫలించి పలు ప్రాంతాల్లో చెరువుల పరిధిలోని వ్యవసాయక్షేత్రాలకు నీరు అందుతోంది. ఈ చెరువుల ద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంది. మొత్తంగా చెరువుల ద్వారా నీటి వనరులు మెరుగుపరచడంతో పాటూ రైతులు, మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా చూస్తోంది. ఇదిలాఉంటే సాగునీటికి సమస్యలేని ప్రాంతాలను గుర్తించి అక్కడి భూములకు అనువైన పంటలు పండించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి ప్రాంతాల్లో పంట కాలనీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంట కాలనీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రావడంతో సంబంధిత అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. రైతుల భూమి విస్తీర్ణం, సాగునీటి వనరులు, భూమి స్వభావం,  ఏఏ పంటలను పండించే అవకాశం ఉందనే వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు సేకరించనున్నారు. ఈ వివరాలన్నింటినీ మార్చి నెలాఖరునాటికి అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానికి తగ్గట్లే రిపోర్ట్ అందించాలని అధికారయంత్రాంగం భావిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల స్వభావాల గుర్తింపే కాక ఇతర వివరాలనూ అధికారులు సేకరిస్తారు. పంట ఉత్పత్తులను స్థానికంగా విక్రయించే ఏర్పాట్లు పరిశీలిస్తారు. పంటలను ఎగుమతి చేసే అవకాశాలను కూడా గుర్తించి ప్రభుత్వానికి అందిస్తారు. 
పంట కాలనీల ఏర్పాటుకు ముందస్తుగా సేకరిస్తున్న వివరాల కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అదికారులు భావిస్తున్నారు. దీని కోసం రైతులు పండించిన వివిధ రకాల పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, ఆహార ధాన్యాలను సేకరించనున్నారు. పంటల సేకరణలో పొదుపు సంఘాల సాయాన్నీ తీసుకోనున్నారు. విత్తనాలను శుద్ధి చేసి వాటి విలువను పెంచే బాధ్యతను పొదుపు సంఘాల మహిళలకు అప్పగించాలని భావిస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర లభించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. దీనికి తగ్గట్లే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవల చిరు ధాన్యాలపై అంతా ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా చిరుధాన్యాలు తినడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలు పండించేందుకు రైతులు కూడా మొగ్గుచూపుతున్నారు. మంచి సాగుభూమి, నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటలు సాగు చేసేలా అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ పంటలు పండించిన రైతులకు మంచి మద్దతు ధర దక్కేలా అధికారయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పండించిన ధాన్యానికి విలువ జోడించేలా పొదుపు సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఇరువర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. దీనికోసం పొదుపు సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ, ఆర్థికసాయం అందించేందుకు బ్యాంకుల సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. రైతులతో పాటూ వివిధ వర్గాల సంక్షేమార్ధం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజాసంక్షేమ విధానాలను మరింతగా ముమ్మరం చేసి రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పథంలో నిలపాలని కోరుతున్నారు. 

Related Posts