
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జగిత్యాల పట్టణం పరిధిలో 108 అంబులెన్స్ సేవలు పూర్తిస్థాయిలో లభించడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రమాదాలబారిన పడినవారిని హుటాహుటిన ఆసుపత్రులకు చేర్చే ఈ వాహనాల్లో మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్న వార్తలొస్తున్నాయి. మొత్తం ఆరు ఉండగా మూడు నిలిచిపోవాల్సిన దుస్థితి నెలకొందని పలువురు అంటున్నారు. ఇంధనం లేకే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి నుంచి 108 సేవలు అందిస్తున్నాయి. అయితే ధర్మపురి, రాయికల్, మల్యాల్లోని ఆంబులెన్సుల సేవలకు విఘాతం ఏర్పడింది. అంబులెన్సులు నిత్యం వందల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. బాధితులకు సకాలంలో వైద్య సేవలు దక్కేలా కృషి చేస్తున్నాయి. అయితే ఇంధనం అందే దారిలేక కొన్ని అంబులెన్సులు నిలిచిపోయిన పరిస్థితి. దాదాపు రెండు నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ. 4 లక్షల వరకు బకాయి ఉందని సమాచారం. అత్యవసర సేవల దృష్ట్యా ప్రధాన కేంద్రాల నుంచి నడిపిస్తున్న 3 ఆంబులెన్స్‌లకు డీజిల్ అందిస్తోంది పెట్రోల్ బంక్. అయితే మరో రెండింటికి ఇంధనం నిలిపివేసింది. దీంతో 108 సేవలు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రమాద ఘటనలు పెరిగాయి. అదనంగా మరో 108 వాహనం కావాలని కొన్నిరోజుల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రాంతంలో ఉన్న అంబులెన్స్ లే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డం సరికాదని అంతా అంటున్నారు.
108 సేవలకు ఇంధన సమస్యే కాక వాహనాలతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ వాహనాలు ఇప్పటికే కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాయి. టైర్లు మార్చాల్సి ఉంది. అరిగిపోయిన టైర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్లు డ్రైవర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 108 సేవలు అందించేవారు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సిబ్బందికి వేతనాల చెల్లింపులు సరిగా సాగడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు నెలల నుంచి జీతాల్లేవని చెప్తున్నవారూ ఉన్నారు. ప్రధాన కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొందరు డబుల్ డ్యూటీ చేస్తున్న వారికి కూడా వేతనాలు అందలేదని అంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాల్సి ఉందని స్పష్టంచేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు 108 వాహనాలు ఉపయుక్తంగా ఉంటున్నాయి. అయితే ఇలాంటి వాహనాల సంఖ్య తగ్గిపోతే సేవలు అందడంలో ఆలమస్యమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం, సంబంధిత యంత్రాంగం స్పందించి అత్యవసర సేవలకు సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. అంబులెన్సులకు తక్షణం ఇంధన సరఫరాను పునరుద్ధారించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అంతేకాక సిబ్బంది సమస్యలు కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచిస్తున్నారు.