
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈవీఎంలపై పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్కస్పష్టంచేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అక్రమాలపై అన్ని వ్యవస్థల తలుపులూ తడతామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ తగ్గలేదని స్పష్టం చేశారు. పొత్తులతో నష్టపోయామని చెప్పలేమని.. అది అధిష్ఠానం నిర్ణయం మేరకే జరిగిందని అన్నారు. మద్యం, డబ్బుతోపాటు ఎన్నో అక్రమాలతో తెరాస గెలుపు సాధించిందని వివరించారు. ఉర్దూ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ప్రాధమ్యాలను వివరించడంతోపాటు తెరాస విధానాలను ఎండగట్టారు.ఏ లక్ష్యం కోసమైతే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో కేసీఆర్ పాలనలో అవి నెరవేడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంగా ప్రజల ఆకాంక్షల సాధన కోసం తాము పోరాడతామని భట్టి స్పష్టం చేశారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాద్యత ఈసీదేనన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు ఎక్కువ మంది గెలుపొందారన్నారు. పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు గెలుపొందిన వారికి, వారిని గెలిపించేందుకు కృషి చేసిన కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. లోకసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని, ఏడెనిమిది సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.