
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం యాదాద్రికి రానున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. కొండపైన జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే చాలాసార్లు యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి మరోసారి ఆలయ పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు 3వేల మంది వివిధ పనుల్లో పాల్గొంటుండటం.. పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో యాదాద్రి శోభాయమానంగా మారుతున్నది. తూర్పు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ దివ్యవిమాన గోపురం, స్వాగత గోపురం, రాజగోపురాల నిర్మాణ పనులు శిల్పకళా వైభవంతో విరాజిల్లుతున్నాయి. ఆర్కిటెక్ట్ ఆనంద సాయి, ఈఎన్సీ రవీందర్‌రావు, స్థపతులు ఎస్ సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారివేలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తిచేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు