
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు టీఆర్‌ఎస్ తరఫున ఇచ్చిన హామీలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వార్షిక మధ్యంతర బడ్జెట్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక వాగ్దానాలు చేశామని, వాటిని అమలు చేయడం తన బాధ్యత అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా బడ్జెట్ ఉండాలని అధికారులకు సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇప్పటికే భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందన్నారు. ఇప్పటికే 77 వేల కోట్ల రూపాయలపైగా ఖర్చయిందని, ఇక నుండి ఏటా సరాసరిన 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల మరమ్మతు కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 46 వేల చెరువులు, కుంటల్లో ఇప్పటికే దాదాపు 20 వేలపైగా చెరువులు, కుంటల మరమ్మతులు జరిగాయన్నారు. మిగతా చెరువులు, కుంటల మరమ్మతులను దశలవారీగా, ప్రాధాన్యతలను గుర్తించి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశలోనే వీటికి కూడా నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. తాగునీటి కోసం ఉద్దేశించిన ‘మిషన్ భగీరథ’ పథకం పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు తాగునీటిని అందించాల్సి ఉందని, ఈ పథకానికి కూడా అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై పేద ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని, పింఛన్లు తదితర అవసరాల కోసం ఇబ్బంది లేకుండా నిధుల కేటాయింపు జరపాలని కేసీఆర్ సూచించారు. రైతుబంధు పథకం కింద 2019 ఖరీఫ్ నుండే ఎకరానికి 10 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఈ హామీని కూడా
అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఇలా ఉండగా వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, ఈ అంశంపై బ్యాంకర్లతో సమగ్రంగా చర్చిస్తే, వాస్తవ పరిస్థితి ఏమిటో స్పష్టంగా వెల్లడవుతుందన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందు వల్ల వాస్తవంగా మన రాష్ట్రానికి 2019-20 సంవత్సరానికి ఏ ఏ పథకాలకు ఎంత మేరకు నిధులు వస్తాయో స్పష్టత కాలేదని కేసీఆర్ గుర్తు చేశారు. అందుకే మన రాష్ట్ర అవసరాలకు కూడా మధ్యంతర బడ్జెట్‌నే (ఓట్ ఆన్ అకౌంట్) ను ప్రతిపాదించాలని సూచించారు