
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచి మార్చి 31 లోగా ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో పనులు సాగడం లేదు. జిల్లాలో నిర్మిస్తున్న నీళ్ల ట్యాంకుల పనులే దీనికి నిదర్శనం. జిల్లాలో రూ.300 కోట్ల పైచిలుకు ఖర్చుతో గ్రామాలకు నీళ్లు అందించాల్సివుండగా పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇంటింటికీ శుద్ధమైన నీటిని అందించడంలో ట్యాంకుల ముఖ్యపాత్ర కీలకం. వాటర్‌గ్రిడ్ల ద్వారా వచ్చే నీటిని ఒడిసిపట్టి నీళ్లను సరఫరా చేయాలి. జిల్లాలోని 20 మండలాల పరిధిలోని ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 720 ట్యాంకుల నిర్మాణం చేపట్టింది. వీటిలో 218 మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 520 ట్యాంకుల నిర్మాణంలో 18 ట్యాంకులకు గుంతలు మాత్రమే తవ్వారు. 16 ట్యాంకులు బెడ్ స్టేజిలో, 43 ట్యాంకులు పునాది స్థితిలో ఉన్నాయి. 328 ట్యాంకులు స్లాబ్ స్థాయిలో, 80 ట్యాంకులకు అడుగు భాగం స్లాబ్ పూర్తయ్యాయి. 17 ట్యాంకులు నిర్మాణం పూర్తయ్యి ప్లాస్టింగ్ దశలో ఉన్నాయి. అడవి ప్రాంత భూముల్లో నీటి ట్యాంకుల నిర్మాణానికి అటవీ శాఖ అభ్యంతరాలు చెప్పడంతో 11 ట్యాంకులు నిలిచాయి. ఇవి మాత్రం కలెక్టర్ ఆదేశాలతో వేగంగా సాగుతున్నాయి. భూ వివాదం కారణంగా నిలిచిన మరో 10 ట్యాంకుల నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది. జిల్లాలో 40 శాతం కూడా పనులు పూర్తికాలేదు. ఇదిలా ఉండగా గ్రామాల్లోని 495 పాత ట్యాంకులకు మరమ్మతులు చేపట్టారు. వీటికి రూ.4 కోట్ల 96 లక్షలు కేటాయించారు.జిల్లాలో ఇంట్రా విలేజ్ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు చెపుతున్నారు. ఇంటింటికీ నీరందించే ప్రక్రియ 99.9 శాతం పూర్తయ్యినట్టు వారి లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 1942.388 కిలో మీటర్ల పనులు పూర్తయినట్టు వివరిస్తున్నారు. మొత్తం 1,95,671 ఇళ్లకు గాను 1,95,350 ఇళ్లకు భగీరథ నీటికి కలెక్షన్ ఇచ్చామని అధికారులు అంటున్నారు.జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు కనిష్ట స్థాయిలోకి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో గతేడాదితో పోల్చుకుంటే 0.015 మీటర్ల లోతులోకి నీటి మట్టం జారిపోయిందని తెలుస్తోంది. దీంతో రానున్న వేసవిలో నీటికి తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. జిల్లాలో సాగుతున్న మిషన్ భగీరథ పనులపై జిల్లా ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 31 లోగా పనులు పూర్తి చేసి ఇంటింటికీ నీరందించాలని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుండటంతో గోదావరి జలాలతో మండు వేసవి గండం గట్టెక్కుతుందని ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంకుల నిర్మాణం పూర్తి కావడం, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. భగీరథ పనులు త్వరగా పూర్తి చేసి నీరందించాలని ప్రజలు కోరుతున్నారు.