YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కడపలో ఎవరి దారి వారిదే

 కడపలో ఎవరి దారి వారిదే
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మూడునెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు తమ పార్టీలను బలోపేతం చేసేందుకు ఆయా పార్టీల నేతలు చమటోర్చుతున్నాయి. పదవులు ఇస్తాం, మాపార్టీకి రండి అంటూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలు విసురుతున్న వలలకు నాయకులు పరుగులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఏపార్టీ ఏ హామీ ఇస్తుందో, ఏ నాయకుడు ఏపార్టీ మారతాతో అంతుపట్టని వైనం కొనసాగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ మొదలై అభ్యర్థులను ప్రకటించాక ఆయా అభ్యర్థులు వారి ప్రాంతాల్లోని బలమైన నేతలను చేరదీసే కార్యక్రమం సాగేది. అయితే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపే జిల్లాలోని తెలుగుదేశం, వైసీపీలు వలలుపట్టుకుని పదవుల ఎర వేస్తున్నారు. దీంతో జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం జోరందుకుంది. ఇప్పటికే వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుండగా తెలుగుదేశంపార్టీ నేతలు ఇంకా సమాలోచనలోనే ఉన్నారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో ఆయా సామాజికవర్గాలకు చెందిన వారిని ఆ ప్రాంతాల్లో కొంతపట్టున్నవారిని, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని గుర్తించి వారిని చేరదీసేందుకు ఈపార్టీలు పూర్తిస్థాయిలో దృష్టిసారించాయి. నాలుగు ఓట్లు ఉన్నవారు అని గుర్తింపురాగానే వారిని మచ్చిక చేసుకునేందుకు ఏకంగా జిల్లాస్థాయిలోని అధినేతలను సైతం రంగంలో దింపుతున్నారు. వార్డు స్థాయి నాయకులు మొదలుకుని, మండల, నియోజకవర్గ నాయకుల వరకు జాబితాలు రూపొందించుకుని మరీ వెంటపడుతున్నారు. వీరిని మచ్చిక చేసుకునేందుకు ఏకంగా పదవుల వర్షం కురిపిస్తున్నారు. మీకు ఎలాంటి పదవి కావాలి, ఆపదవి మేమే ఇస్తాం, రానున్న ఎన్నికల్లో ఖర్చులు కూడా మేమే భరిస్తాం, నీ ఆర్థిక ఇబ్బందులు కూడా పరిష్కరిస్తాం అంటూ హామీలు ఇస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో చోటా మోటా నేతలు ఈహామీలకు లొంగిపోయి , పార్టీలను మారుస్తున్నారు. గతనెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీనుండి వైసీపీకి, వైసీపీ నుండి తెలుగుదేశంపార్టీకి కండువాలు మార్చే కార్యక్రమం ముమ్మరమైంది. ఇటీవల పార్టీల నేతలు గ్రామాలకు వెళ్లడం, ఆ గ్రామాల్లో ఉన్న ఇల్లు, ఓటర్లకంటే అధికంగా ఆ గ్రామస్థులు తమ పార్టీలో చేరండని ప్రకటనలు ఇవ్వడం పరిహాసంగా మారింది. దీనికితోడు తెలుగుదేశంపార్టీలోనూ, వైసీపీలోనూ అసంతృప్తివాదుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎవరు ఏమేరకు హామీ ఇస్తారో అని ఎదురుచూస్తూ ప్రత్యర్థిపార్టీలు చూపే ప్రలోభాలకు లాల్ సలామ్ చేస్తూ గంటల వ్యవధిలోనే పార్టీలు మారుతున్నారు. ఈపరిణామం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముమ్మరంగా సాగుతోంది. దీంతో కేవలం చోటా నేతలనే కాకుండా బడానాయకులను సైతం పార్టీలు మారిపించే వైనం ముమ్మరమైంది. పార్టీలు మారిన అధినాయకులు సైతం రానున్న ప్రభుత్వంలో మనమే చక్రం తిప్పుదాం, మావెంట రండి, మమ్ములను నమ్మండి, మీకు మా పార్టీ అధినేతలతో హామీలు ఇప్పిస్తాం అంటూ తీవ్ర భరోసాలు సాగిస్తున్నారు. దీంతో ప్రధానంగా రాజంపేట, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ఈ హామీల జోరుగా ఉంది. వైసీపీ ఇప్పటికే జమ్మలమడుగు, మైదుకూరు అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయగా, తెలుగుదేశంపార్టీ పులివెందులను మాత్రమే అభ్యర్థిని ఖరారు చేసింది. ఈనేపధ్యంలోనే కడపకు చెందిన మాజీ మంత్రి ఖలీల్‌బాషాను ఆగమేఘాలమీద పార్టీలో చేర్చుకున్నారు. అదే విధంగా ఇదే నియోజకవర్గంలో పలువురు నేతలను జగన్ సమక్షంలో చేర్చించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీకి చెందిన అసమ్మతి వర్గాలను తమ వర్గంలోకి తెప్పించుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే తెలుగుదేశంపార్టీ అభ్యర్థులను ప్రకటించాక, వారు కూడా వైసీపీలోని అసంతృప్తివాదులను దరిచేర్చుకునే ప్రయత్నాలు సాగించే అవకాశాలున్నాయి. ఇలా రెండుపార్టీలు వలలు పట్టుకుని గాలిస్తున్నాయి.

Related Posts

0 comments on " కడపలో ఎవరి దారి వారిదే"

Leave A Comment