YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు

తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకే, బీజేపీ పొత్తులపై గత కొద్ది నెలలుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ తమిళనాడులో గురువారం అర్ధరాత్రి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పుదుచ్చేరితో సహా తమిళనాడులో 40 పార్లమెంటు స్థానాల్లో కలిసి పోటీచేయడానికి అన్నాడీఎంకే, బీజేపీలు ఓ అంగీకారానికి వచ్చాయి. తాజా ఒప్పందం ప్రకారం అన్నాడీఎంకే 25, బీజేపీ 15 స్థానాల్లో పోటీచేయనున్నాయి. అన్నాడీఎంకే తరఫున తమిళనాడు సీఎం పళనిసామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌లు భేటీలోపాల్గొని సీట్ల సర్దుబాటుపై చర్చించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. బీజేపీతోపాటు ఇతర పార్టీలకు 15 సీట్లను కేటాయించిన అన్నాడీఎం మిగతా 25 స్థానాల్లో పోటీచేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ 8, పీఎంకే 4, డీఎండీకే 3, అన్నాడీఎంకే 25 సీట్లలో పోటీచేస్తాయి. చెన్నైలోని అల్వార్‌పేట్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త పొల్లచ్చి ఎన్ మహాలింగం నివాసంలో అర్ధరాత్రి జరిగిన ఈ చర్చల్లో తమిళనాడు మంత్రులు తంగమని, ఎస్పీ వేలుమని సైతం పాల్గొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ మినహా అన్నాడీఎంకే, పీఎంకే, డీఎండీకేలు కూటమిగా పోటీచేశాయని, తిరిగి వచ్చే ఎన్నికలకు కలిసే వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఏ ఏ సీట్లలో ఎవరు పోటీచేయాలనే విషయమై ఇంకా కొలిక్కిరాలేదని, దీనిపై మరోసారి సమావేశం అవుతారని తెలిపాయి. వచ్చే వారమే ఈ సమావేశం ఉంటుందని, చిన్న చిన్న సమస్యలున్నా వాటిని పరిష్కంచిన తర్వాతే కూటమిపై ప్రకటన వెలువడుతుందని వెల్లడించాయి. పియూష్ గోయల్‌తో తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణ‌న్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తమిళ్‌సాయి సౌందరరాజన్‌లు వచ్చినా, వారిని వేరో గదిలోనే ఉండమని ఆదేశించడం గమనార్హం. పొత్తుల గురించి పూర్తి వివరాలు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పీయూష్ గోయాల్, అన్నాడీఎంకేలోని నలుగురు ముఖ్య నేతలకే తెలుసనని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. మరోవైపు, మీడియా కంటబడకుండా ఈపీఎస్, ఓపీఎస్‌లు మహాలింగం నివాసానికి చేరుకోవడం కొసమెరుపు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులు పియూష్ గోయల్‌, మంత్రి పొన్ను రాధాకృష్ణ‌న్, బీజేపీ అధ్యక్షుడు తమిళ్‌సాయి సౌందరరాజన్‌లు అర్ధరాత్రి 1 గంటకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు వెళ్లిపోయిన చాలా సేపటి తర్వాత ఈపీఎస్, ఓపీఎస్‌లు అక్కడ నుంచి బయటపడ్డారు. ====================================
51 ముజఫర్ నగర్ లో అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సీఎం పాత్ర
పాట్నా, ఫిబ్రవరి 16,  (న్యూస్ పల్స్)
ముజఫర్‌పూర్ వసతిగృహ‌ంలో బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ, కీలక ఆధారాలను సేకరించింది. తాజాగా, ముజఫర్‌పూర్ ఘటనపై ప్రత్యేక న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తోపాటు మరో ఇద్దరు అధికారులను విచారించాలని ఆదేశించింది. బాలికలపై అఘాయిత్యాల వ్యవహారంలో మరి కొందరు అధికారులకు ప్రమేయం ఉందని, ముఖ్యమంత్రి నితీశ్‌కు సైతం సంబంధం ఉందని ఆరోపిస్తూ ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన ఆర్‌ఎంపీ అశ్వని పిటిషన్ దాఖలు చేశాడు. సీబీఐ విచారణలో అసలు నిజాలు బయటకు రావడం లేదని, ముజఫర్‌పూర్ మాజీ డీఎం ధర్మేంద్ర సింగ్, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుత సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్ కుమార్ సింగ్, సీఎం నితీశ్ కుమార్‌ల పాత్రపై దర్యాప్తు చేయాలని అందులో కోరాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పోస్కో న్యాయస్థానం జడ్జ్ మనోజ్ కుమార్, పిటిషన్‌దారుడు పేర్కొన్నవారి గురించి విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఢిల్లీలోని పోస్కో కోర్టుకు ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. వచ్చేవారం నుంచి దీనిపై పోస్కో కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. గతేడాది మేలో ముజఫర్‌పూర్‌ వసతి గృహంలో అత్యాచారాల ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. వసతీ గృహంలోని 42 మంది బాలికల్లో 34 మందిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వసతి గృహం నిర్వాహకుడు బ్రజేశ్‌ ఠాకూర్‌ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. వసతి గృహానికి ఎవరైనా అతిథులు వస్తే బాలికలతో అశ్లీల నృత్యాలు చేయించడం, అధికారుల లైంగిక వాంఛలను తీర్చుకోడానికి డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలకు పాల్పడటం లాంటి దురగతాలకు ఒడిగట్టారు. అక్కడ సిబ్బంది చెప్పినట్టు వినకపోతే వారిని శారీరకంగా హింసించేవారు. ఇలా ఎదురుతిరిగినందుకు ఓ బాలికను చిత్రహింసలకు గురిచేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సర్వేలో బాలికలపై అఘాయిత్యాలు వెలుగుచూశాయి.

Related Posts