YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు Karnataka

వార్తా ప్రపంచంలో నవ 'క్రాంతి' 

వార్తా ప్రపంచంలో నవ 'క్రాంతి' 

సంక్రాంతే స్ఫూర్తిగా..

దోపిడీవర్గ నిరంకుశ రాజ్యం కొనసాగ కుండా..

బలమైన కాపలా వ్యవస్థ పనిని యువ్ న్యూస్  చేస్తుంది. 


సంక్రాంతి పండగ అంటే పదిమందీ కలిసి పంచభ్యక్ష్యాలూ, పరమాన్నాలూ పంచుకొని తినడం. మూడు రోజుల పండగైనా ఆ చైతన్యం మూడొందలరవైఅయిదు రోజులూ ఉంటుంది. అందుకే సంక్రాంతే స్ఫూర్తిగా 'యువ్ న్యూస్ ' ప్రారంభిస్తున్నాం. 
మీడియా నేడు ఎంతగా విస్తరించుకొన్నదో విజ్ఞులైన పాఠకులకు చెప్పనక్కరలేదు. నట్టింట్లో నెట్టింట్లో దాని సందడి అమోఘం. రాజకీయాలు, సామాజిక అంశాలు, వినోదం ఒకటేమిటి అన్ని జీవనరంగాల పైన తనదైన రీతిలో సమాచార సముద్రాన్ని అనునిత్యం ప్రజల కళ్ళ ముందు కుమ్మరిస్తున్నది వెబ్‌మీడియా. బాలలు,యువత నెట్‌ తెరలకు అతుక్కుపోయి గంటలు గంటలు గడుపుతున్నారంటే సామాజిక మీడియా పరిష్వంగం ఎంత విడదీయ రానిదో వెల్లడౌతున్నది. 
సంక్రాంతి అంటేనే భోగి, మకర, కనుమ అంటూ మూడు రోజుల సందడి. ఈ మూణ్నాళ్ల సంరంభాలు మూణ్నాళ్ల ముచ్చటలా కాకుండా... చాన్నాళ్లు గుర్తుండిపోతాయి. మిగతా పండగలప్పుడు ఖర్చెక్కువ. సంక్రాంతి నాడు దిగుబడి ఎక్కువ. ఈ రోజు రైతు జేబులో రొక్కముంటుంది. భార్య మెడలో బంగారముంటుంది. బిడ్డల చేతుల్లో పతంగులు ఎగురుతాయి. పొలిమేరల్లోని పొలాలనుంచి ఇంటి వసారాలోని గరిసెల్లో ధాన్యాలు జలజలా రాల్తాయి. కొట్టంలోని ఎడ్ల మెడగంటలు గలగలలాడతాయి. చేనూ, చెలకా, బంతీ, చేమంతీ, రేగూ, భోగీ, భాగ్యం పుష్కలంగా ఉంటే సమాజం బాగుంటుంది. అందుకే కర్షక సోదరుల జీవితాల్లోని సకల వెలుగులను మా వెబ్‌ ఛానెల్‌ మీకు పంచుతుంది. 
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పతంగులు ఎగరెయ్యడమంటే... సంతోషాన్ని పటంగా కట్టి... నీలాకాశపు గోడకు దారంతో వేలాడదీయడం. మీ ఆనందాలను తారస్థాయికి తీసుకెళ్లాలంటే, సింపుల్‌గా పతంగి ఎగరెయ్యాలంతే. దారం వదులుతున్నామంటే మనసును మరింతగా సంతోష వినువీధులకు విస్తరిస్తున్నామన్నమాట. పతంగులను మనం కేవలం సరదాగా ఎగురవేసే ఆటలాగా మాత్రమే చూడకూడదు. నిజానికి పతంగుల్లో జీవితానికి 
పనికొచ్చే వ్యక్తిత్వ పాఠాలు కూడా ఉన్నాయి. 
ే పతంగం ఎగరేయడం మొదలెట్టినప్పటినుంచి.. అదే పనిగా ఎగురుతూ వెళ్లదు. మధ్యలో పడుతుంది. దాన్ని మళ్లీ లేపి ఎగరేయాలి.. కొన్ని సార్లు పడినా సరే.. ఒకసారి పుంజుకున్నదంటే.. అలా ఆకాశం వరకూ వెళ్లిపోతుంది. ఎదురుదెబ్బలు తప్పవు.. పడ్డాక లేచి ఎగరాల్సిందే... 
అలాగే మన లక్ష్యాన్ని అందుకోడానికి ప్రయత్నించేటప్పుడు.. మొదట్లో మనకు ఇబ్బందులు రావచ్చు. ఎదురుదెబ్బలు తగలవచ్చు. కానీ అక్కడితో నీరసపడిపోకుండా.. దెబ్బలను తట్టుకుంటూ ముందకు సాగాలి. నొప్పిని ఓర్చుకుంటూ ముందుకు సాగాలి. మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయ పథం వైపు అడుగులు వేస్తాం.. ఇలాంటి వ్యక్తిత్వ పాఠాలు 'యూవ్‌ న్యూస్‌' మీకు షేర్‌ చేస్తుంది. 
జీవితమంతా ఆనందాలేనా? మరి కష్టాలూ వెతలూ లేవా?. దీన్ని మకర సంక్రాంతంటారు. మకరం అంటే మొసలి. ఏనుగును పట్టేసినట్టుగా ఎందరినో పట్టి పీడించే కష్టాల మొసళ్లు ఉండనే ఉంటాయి. కానీ సంక్రాంతి నాటి నుంచి కొత్త కాంతీ, క్రాంతి తప్పక వస్తాయి. ప్రజలు పడుతున్న కష్టాల మొసళ్లనుంచి కాపాడటానికి మా యవ్‌న్యూస్‌ ముందుంటుంది. 
యథాతథ సామాజిక, ఆర్థిక, రాజకీయ, దోపిడీవర్గ నిరంకుశ రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యాంగం ముసుగులోనే నిరాటంకంగా కొనసాగ కుండా, బలమైన కాపలా వ్యవస్థ పనిని 'యువ్ న్యూస్' ఎదురులేని రీతిలో నెరవేర్చడానికి సీనియర్‌ పాత్రికేయుల బృందం నిరంతరం కృషి చేస్తుంది. 
సకల తెలుగు ప్రజలందరిలో సంతోషానందాలు నిండాలి. సంక్రాంతి శుభాకాంక్షలతో.. 
ఎడిటర్‌ 
'యువ్ న్యూస్' 

Related Posts