
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మంగళవారం ఉదయం స్థానిక జెడ్.పి. మైదానంలో జరిగిన షీ టీం 2 కె పరుగును జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి ప్రారంభించారు. పోలీస్ షీ టీమ్స్ గురించి సమాజంలో మరింత అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ పరుగులో వివిధ కళాశాలలకు చెందిన యువత పాల్గొన్నారు. జడ్పి. మైదానం నుండి ప్రారంభమైన పరుగు అంబేద్కర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, పాత బస్ స్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా తిరిగి జడ్.పి. గ్రౌండ్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా సుమారుగా మూడు వందల మంది యువతీయువకులు ఎంతో ఉత్సాహంగా ఈ పరుగులో పాల్గొనడం విశేషం. యువతకు ఉత్సాహం కలిగించేందుకుగానూ కలెక్టర్, ఎస్పి కూడ పరుగులో ముందుండి నడిపించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ పోలీసు షీ టీమ్స్ మన మహిళా సమాజానికి గొప్ప భరోసా ఇస్తున్నాయని అన్నారు. మహిళలపై వివిధ రకాలుగా జరిగే హింసను నిర్మూలించటానికి యువత కూడ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అందరం సంతోషంగా ఉండేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పర్చుకోవడంలో ఎవరికివారు తమ బాధ్యతలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. షీ టీమ్ సభ్యులు వేగవంతంగా స్పందించడం తనకు తెలుసని అన్నారు. వారు వృత్తిలో నైపుణ్యాలను కలిగి ఉన్నారని, అల్లరి పనులతో చెడు దారిలో వెళ్తున్న యువతను తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం వలన ఎంతో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. 2కె పరుగు ఉద్దేశాన్ని గుర్తించి షీ టీమ్స్ గురించి అవగాహన కల్పించే ప్రచారం అందరూ చేయాలని తెలిపారు.
జిల్లా ఎస్పి. రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో పది షీ టీమ్స్ పని చేస్తున్నాయని, ఇబ్బందులు పడేవారు మౌనంగా ఉండడం వలన నేరస్థులు మరింత రెచ్చిపోతారని అన్నారు. ప్రాథమిక దశలోనే వారిని అరికట్టేందుకు షీ టీమ్స్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా షీ టీమ్ సభ్యులు కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా కేసు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయంలో యువతకు తమ కుటుంబ సభ్యులు మార్గదర్శనం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. పోకిరీల నుండి సమస్యలు ఎదుర్కొంటున్నవారు నిర్భయంగా షీ టీమ్ మొబైల్ నెంబర్ 9440713000 లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని, ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని ఎస్.పి. గారు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి.ఎన్. వేంకటేశ్వర్లు, డి.ఎస్.పి. లు బి.భాస్కర్, జి.గిరిబాబు, ఇమాన్యుయేల్, షీ టీమ్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర రావ్ మరియు ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ. లు సిబ్బంది పాల్గొన్నారు.