
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేసవి కాలం ప్రారంభంలోనే జిల్లాలోని వాగులు, వంకలు వట్టిపోయాయి.. భూగర్భజలం అడుగంటిపోతోంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మే నెలలో నీటి ఎద్దడి తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పాటు, భూగర్భజలాలను ఇష్టారీతినా పైకి లాగేస్తుండటంతో భూగర్భజలమట్టం గణనీయంగా పడిపోయింది. జిల్లాలోని అనేక మండలాల్లో తాగునీటి సమస్య మొదలైంది. బోర్లు, బావుల్లో నీరు లేక కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. సాగు నీటి సమస్యతో యాసంగి సాగును తగ్గించుకోవాల్సి వచ్చింది.
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. మరోవైపు భూగర్భజలమట్టం పడిపోవడం, కొన్ని గ్రామాల్లో బావులు, బోర్లలో నీరు అడుగంటి పోవడంతో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే ఏటా 10 మీటర్ల లోతుకు నీటి మట్టం తగ్గిపోతోంది. వచ్చే మూడు నెలల్లో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగి భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 15 ప్రాంతాల్లో ఫీజోమీటర్ల ద్వారా భూగర్భజలాల పరిస్థితులను అంచనా వేయగా, నేరడిగొండ మండలంలో గత నవంబర్ నెలలో 8.8 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం మే నెల వచ్చే సరికి 48.2 మీటర్ల లోతుకు చేరుకుంది. దీంతో పాటు బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, ఆదిలాబాద్, జైనథ్ మండలాల్లో 15 మీటర్ల కంటే దిగువకు భూగర్భజలాలు పడిపోగా, మరో ఆరు మండలాల్లో జిల్లా సగటు కంటే లోతుకు పడిపోయినట్లుగా భూగర్భజలశాఖ నివేదికను బట్టి స్పష్టమవుతోంది.
వర్షం నీటిని నిల్వ చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో కురిసే వర్షం నీటిలో 50 శాతం వృథాగా సమద్రంలో కలుస్తోంది. నీటి సంరక్షణ చేపడితే రాబోయే రోజుల్లో నీటి ముప్పును తప్పించుకోవచ్చు. ఇంటింటా ఇంకుడుగుంతలు, చెరువుల పునరుద్ధరణ కుంటలు, చెక్‌డ్యాంలు తదితర వాటిని నిర్మించాల్సిన అవసరముంది. ఇంకుడు గుంతలు తవ్వుకోవడం వల్ల నీరు భూమిలోనే ఇంకి భూగర్భజలమట్టం పెరిగే అవకాశముంది. ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని బాధ్యతగా నిర్మించుకుంటే బోరుబావుల్లో నీటిని సంరక్షించుకున్నవారవుతాం. ఉపాధిహామి పథకం కింద ఇంకుడుగుంత నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ ఉంటే ఆ నీరు తాగడానికి పనికిరాదు. అయితే జిల్లాలోని నాలుగు మండలాల్లోని గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. ఇచ్చోడ మండలంలో మూడు గ్రామాలు, ఉట్నూర్‌లో రెండు గ్రామాల్లో మరో గుడిహత్నూర్, ఆదిలాబాద్, జైనథ్ మండలాల్లో ఒక్కో గ్రామాల్లోని నీళ్లలో ఫ్లోరైడ్ ఉంది.
జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, బేల, గుడిహత్నూర్, తలమడుగు, తాంసి, ఇంద్రవెల్లి తదితర మండలాల్లో భూగర్భ జలాలను పరిమితి కన్నా అధికంగా నీటిని తోడుతున్నారు. జిల్లా మొత్తంలో సగటున 63 శాతం నీటిని వెలికి తీస్తుంటే ఆయా మండలాల్లో 70 శాతం భూగర్భజలాల వాడకం ఉంది.. రైతులు 300-500 అడుగుల లోతు వరకు బోర్లు తవ్వి నీరు తీస్తున్నారు. గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన రైతు బాలాజీ ముండే. తనకున్న పది ఎకరాలకు సాగు నీటి సౌకర్యం అందించేందుకు మూడు బోర్లు మూడు వందల అడుగు లోతు వరకు వేశారు. రెండింటిలో నీరు పడలేదు. ఒక బోరులో కొంత మేరకు నీళ్లు ఉన్నా. వేసవిలో అడుగంటిపోతుండటంతో పశువుల కోసం కొద్ది మొత్తంలో గడ్డి సాగు చేస్తున్నారు. నీళ్లుంటే యాసంగి పంట సాగు చేసుకునే వీలుండేది. ఈయనతో పాటు సమీపంలో సాగు భూమి ఉండే రైతులు అంకుశ్, గంగాధర్, రాంచందర్ తదితర రైతులు సైతం రెండేసి బోర్లు వేసి, నీళ్లు పడకపోవడంతో వదిలేశారు. బోథ్ మండలం అజ్జర్‌వజ్జర్ గ్రామంలో ఉండే బావి ఇది.. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉండే నాలుగైదు గ్రామాలకు ఈ బావి నీరే దిక్కు. ఆయా గ్రామాల్లో వేసిన బోర్లు వేసవి కాలం వచ్చిందంటే అడుగంటి పోతాయి.గ్రామాలకు తాగు నీటిని అందించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయిదు వందల అడుగుల వరకు వెళ్లి బోరువేసిన వేసవి కాలంలో నీళ్లు ఉండటం లేదు.