
జిల్లాలోని రిజర్వాయర్ల నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రతిపాదిత గ్రామాలలో సామాజిక, ఆర్ధిక స్థితిగతులపై సర్వే చేపట్టనున్నట్లు, సర్వే చేస్తున్న అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉదయం భూ సేకరణ పునరావాస, పునరోపాధి కల్పన పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్అండ్ఆర్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డిలతో ఆర్అండ్ఆర్ చెల్లింపులు చేయాల్సిన అంశాల పై కమిటీ సభ్యులు డీసీసీబీ చిట్టి దేవేందర్ రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రతిపాదిత ముంపునకు గురయ్యే గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కూడిన 26మంది సభ్యుల బృందం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ మేరకు గ్రామాలలోని ప్రజలు వారి నివాసాల యందు ఉండి ఇట్టి సర్వేకు వచ్చిన అధికారులు, అధికారిక సిబ్బందికి సంపూర్ణంగా సహకరించి, మీయొక్క పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకునేలా.. సహకారం చేస్తూ సర్వేను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ వేణు, ఆనంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.