
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యతనిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో అడవుల నరికివేత, పోడు రూపంలో అంతరించిపోతున్న సమయంలో సీఎం కేసీఆర్ బృహత్తరమైన హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.భూపాలపల్లి ఏరియాలో 5వ విడత హరితహారాన్ని దృష్టిలో పెట్టుకొని మంజూర్‌నగర్ వద్దనున్న 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంస్థ నర్సరీలో ఆరు లక్షల మొక్కలను పెంచుతున్నది. ఏ యేటికి ఆ యేడు హరితహార లక్ష్యాలను అధిగమిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందిస్తోంది నేటి తరాలతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ హరితహార పథకం దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చనుంది. ఇందులో భాగంగా సింగరేణి సంస్థ కూడా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి సింగరేణి వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హరితహారం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నది. భూపాలపల్లి ఏరియాలో పది లక్షల మొక్కలు నాటి, పంపిణీ చేయాలని యాజమాన్యం లక్ష్యంగా నిర్ణయించగా 12.03 లక్షల మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా కోటికి పైగా మొక్కలను నాటడం, పంపిణీ చేశారు. భూపాలపల్లి ఏరియాలో 10 లక్షల మొక్కలను నాటడం, పంపిణీ చేయాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా నిర్ణయించగా 12.34లక్షల మొక్కలను సింగరేణి స్థలాలలో నాటడంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు పంపిణీ చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలను సింగరేణి సంస్థ తమ స్థలాల్లో నాటడంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు పంపిణీ చేసింది. భూపాలపల్లి ఏరియాలో 8 లక్షల మొక్కలను తమ స్థలాల్లో నాటడంతోపాటు వివిధ వర్గాల ప్రజలకు పంపిణీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా సింగరేణి యాజమాన్యం లక్ష్యం నిర్ణయించలేదు. . సింగరేణి సంస్థ హరితహారంలో భాగంగా ప్రతియేటా మొక్కలను నాటడంతో పాటు సింగరేణి కుటుంబాలకు, కాలనీవాసులకు, పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు కొన్నిచోట్ల రైతులకు కూడా పెద్ద ఎత్తున మొక్కలను పంపిణీ చేస్తూ వస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా 50 లక్షల మొక్కలను సింగరేణి సంస్థ నాటడంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు పంపిణీ చేసింది. భూపాలపల్లి ఏరియాలో 7 లక్షల మొక్కల లక్ష్యానికి గాను 7లక్షల 50వేల మొక్కలను ప్రజలకు పంపిణీ చేసింది. అదే విధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలో కోటి మొక్కలను నాటడంతో పాటు.. పంపిణీ కూడా చేశారు. మరో రెండు నుంచి నాలుగు లక్షల జామాయిల్ మొక్కలను టెండర్ ద్వారా కొనుగోలు చేసి సింగరేణి స్థలాలలో నాటడంతో పాటు ప్రజలకు పంపిణీ చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సంస్థ నర్సరీలో మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, ఉసిరి, వేప, కానుగ, దానిమ్మ, చిందుగా, ఇప్ప, తాని, కరక, వెదురు, అల్లనేరేడు, జిట్రేగి, జమ్మి, రావి, మర్రి, మేడి, ఆల్‌స్టోనియా, మారేడు, నారవేప తదితర 60 రకాల జాతుల మొక్కలను సింగరేణి నర్సరీలో యాజమాన్యం పెంచుతున్నది