
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్రంలో వేడుకలు, ఎగ్జిబిషన్లు సమావేశాల నిర్వహణకు వివిధ శాఖల అనుమతుల మంజూరీకి సంబంధించి సమర్పించిన ముసాయిదా నిబంధనలపై చర్చించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో వేడుకలు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, ఫైర్ సర్వీస్ డిజి గోపికృష్ణ, అడిషనల్ డిజి. (శాంతి భద్రతలు) జితేందర్, పోలీస్ కమీషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, పోలీసు అధికారులు అనిల్ కుమార్, విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ శాశ్వత భవనాలు, సముదాయాలు, తాత్కాలిక సముదాయాలలో జరిగే ఎగ్జిబిషన్లు, వేడుకలను వర్గీకరించడంతో పాటు చిన్న, మద్య, పెద్ద తరహా కేటగిరీలుగా విభజించి నిబంధనలను రూపొందిస్తున్నామన్నారు. నిర్వాహకులు తీసుకోవలసిన చర్యలు, ఆపరేషన్ ప్రోటోకాల్ పై సలహాలు, వివరాలు అందిస్తామన్నారు. ముసాయిదా నిబంధనలపై సంబంధిత శాఖల సలహాల అనంతరం తుది నిబందనలను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. నిర్వాహకులు నిబంధనలకు సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తాత్కాలిక సముదాయాలలో పెద్దస్ధాయిలో నిర్వహించే సమావేశాలకు సంబంధించి పోలీసు శాఖలకు ధరఖాస్తు సమర్పిస్తే సంబంధిత శాఖలు క్షేత్ర స్ధాయిలో పర్యటించి తమ అనుమతులను పోలీసు శాఖకు సమర్పించిన అనంతరం తుది అనుమతి జారీ అవుతుందన్నారు. దరఖాస్తు సమర్పణపై నిర్ణీత సమయాలను పొందుపరుస్తామన్నారు. నుమాయిష్, చేప ప్రసాదం పంపిణీ, ఎగ్జిబిషన్ల లాంటి రెగ్యులర్ ఈ వెంట్స్ కు సంబంధించి ఫైర్, ఇన్సురెన్స్, మంచినీరు, విద్యుత్, లే అవుట్, పార్కింగ్, టౌన్ ప్లానింగ్, పిసిబి, పోలీసు తదితర శాఖల నుండి అనుమతులకు సంబంధించి గైడ్ లైన్స్ జారీ అవుతాయన్నారు.