
మలేషియా పర్యటనలో డీఎక్స్ఎన్ ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ఎంతో సులభంగా, సరళతరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ ప్రోత్సాహం అందిస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతనిస్తున్నందున తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన సమావేశంలో డీఎక్స్ఎన్ సంస్థ ప్రతినిధులకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను, ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణలో ఆహారశుద్ది పరిశ్రమలకు అవకాశం ఉందని, సిద్దిపేటలో ఇప్పటికే పరిశ్రమ ఏర్పాటులో ఉన్న డీఎక్స్ఎన్ సంస్థ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా దక్షిణ తెలంగాణలోని వనపర్తి ప్రాంతంలో రెండో పరిశ్రమ ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారని, ఇక్కడ దాదాపు రూ.200 నుండి రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారని మంత్రి వెల్లడించారు. అనేక రకాల ఆహార ఉత్పత్తులను ప్రోత్సహిస్తారని, తెలంగాణల సాధారణంగా పండించే పంటలతో అనేక రకాల ఆహార ఉత్పత్తులు ప్రోత్సహిస్తూనే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల ఉత్పత్తులకు రైతులకు ప్రోత్సాహం అందిస్తారని, వాటిని ప్రాసెసింగ్ చేసిన అనంతరం అంతర్జాతీయ మార్కెట్ కు ఎగుమతి చేస్తారని తెలిపారు. వనపర్తి ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం నచ్చే అక్కడ పెట్టుబడులు పెడుతున్నామని డీఎక్స్ఎన్ సంస్థ ఫౌండర్, సీఈఓ లిమ్ సియో జిన్ అన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు 2020 వరకు పూర్తవుతాయని భావిస్తున్నామని, వెయ్యి నుండి 1500 మందికి ఉపాధికి అవకాశం ఉంటుందని తెలిపారు.