
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఎర్లీబర్డ్ పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు రూ. 500 కోట్లను ఎర్లీబర్డ్ పథకంలో సేకరించాలని జీహెచ్ఎంసి లక్ష్యంగా నిర్థారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తిపన్నును ముందస్తుగా ఈ నెల 30వ తేదీలోగా చెల్లిస్తే ఆస్తిపన్ను మొత్తం పై 5శాతం రిబేట్‌ను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఎర్లీబర్డ్ కింద సేకరించే పన్ను లక్ష్యాన్ని జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్లకు నిర్దేశిస్తూ కమిషనర్ ఎం.దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగా ఈ క్రింది విధంగా లక్ష్యాలను నిర్థారించారు.ఈ ప్రతిపాదిత రూ. 500 కోట్ల ఆస్తిపన్ను సేకరణ లక్ష్యంలో 50శాతం పన్నులు రూ. 250 కోట్లు వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల ద్వారా సేకరించాలని, పౌర సేవా కేంద్రాల ద్వారా 20 శాతం పన్నులు రూ. 100 కోట్లు, మరో వంద కోట్లను ఆన్‌లైన్ ద్వారా, రూ. 50 కోట్లను మీ- సేవా కేంద్రం ద్వారా సేకరించడానికి ప్రణాళికలు రూపొందించారు.
*పన్నుల సేకరణకు బల్దియా సిబ్బంది*
ఎర్లీబర్డ్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను సేకరణకు జీహెచ్ఎంసీ ఉద్యోగులైన వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల ద్వారా సేకరించాలని కమిషనర్ దానకిషోర్ నిర్ణయించారు. గతంలో పన్ను చెల్లింపుదారులు కేవలం జీహెచ్ఎంసి పౌర సేవా కేంద్రాలు, ఆన్‌లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా మాత్రమే చెల్లించేవారు. దీనికి భిన్నంగా ఈ సారి జీహెచ్ఎంసి సిబ్బంది ద్వారా కూడా నివాసేతర ఇళ్ల పన్నులను సేకరించడానికి ప్రత్యేక దృష్టి సాధించారు. నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల నుండి ఆస్తిపన్నును సేకరించే విషయంలో ప్రత్యేక దృష్టి సాధించాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లకు దానకిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇందుకుగాను రోజువారి ఆస్తిపన్ను సేకరణ లక్ష్యాలను కూడా నిర్థారించారు. కాగా సోమవారం నుండి మీ-సేవా కేంద్రాలతో పాటు జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ల ద్వారా ఆస్తిపన్ను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరులోగా ప్రస్తుత సంవత్సర ఆస్తిపన్నును చెల్లించి 5శాతం రాయితి పొందాలని నగరవాసులకు జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ తెలియజేశారు.