
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నిబంధనల ప్రకారం పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించని నగరంలోని పబ్లు, రెస్టారెంట్ల పై తగు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసిని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ నేడు ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్ నెం: 36, 45, 46, 33 తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పబ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయని, వీటికి సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనాలను రోడ్లపైన, సబ్ రోడ్లపై పార్కింగ్ చేయడంతో సాధారణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల్లోని నివాసితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని పబ్లు, రెస్టారెంట్లను తనిఖీచేసి భవన నిర్మాణ అనుమతుల నిబంధనల ప్రకారం పార్కింగ్ వసతి ఉన్నది లేనిది పరిశీలించాలని, లేనట్టైతే ఆయా పబ్లు, రెస్టారెంట్లను మూసివేయడం లాంటి చర్యలను కూడా చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరుతూ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ లిఖితపూర్వక ఆదేశాలు జారీచేశారు.