
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పిఎస్) నాయకుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు బుధవారం గృహ నిర్బంధంలో ఉంచారు. అంబర్ పేట్ ప్రాంతం డిడి కాలనీలో ఉంటున్న కృష్ణ మాదిగ నివాసానికి ఉదయాన్నే చేరుకున్న పోలీసులు ఆయనన గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంటి నుంచి ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని మంద కృష్ణ ప్రశ్నించారు. దళితుడైనందునే అంబేద్కర్ ను కేసీఆర్ అవమానించారని విమర్శించారు. అగ్రకులస్తుడైన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో హైదరాబాదుకు వచ్చినప్పుడు ఆయనకు కేసీఆర్ పాదాభివందనం చేశారని... దళితుడైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మాత్రం పుష్పగుచ్ఛం ఇచ్చి, కరచాలనం చేశారని విమర్శించారు. ఈ నెల 22వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలు, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. మంద కృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేయడంపూ ఎమ్మార్పీస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తూ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని
ఎంఆర్పిఎస్ నేతలు ఆరోపించారు.