
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సూర్యాపేట జిల్లాలో 20 కిలోల పురాతన నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 11.20 గంటలకు హుజూర్‌నగర్ మండలం అమరవరం గ్రామంలో గురువారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో జంతుబలిచ్చి పూజలు చేశారు. సందేహం రావడంతో ఈవిషయంపై స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన ఆ ఇంటిని తనిఖీ చేయగా తవ్వకాలు జరిపి బయటకు తీసిన పురాతన బంగారు నాణేలు, ముద్దలను గుర్తించారు. వీటి బరువు సుమారు 20 కిలోలు ఉండొచ్చని తెలిపారు. అయితే ఇదే మండలంలోని యాతవాకిళ్లలో రెండు నెలల క్రితం తవ్వకాల్లో నాణేలను గురువారెడ్డి తెచ్చి, తన ఇంట్లో పాతిపెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ నోటా ఈనోటా బయటకు పొక్కిన ఈవిషయం, తాజాగా మంగళవారం రాత్రి ఇంట్లో జంతుబలి చేస్తుండగా పోలీసుల తనిఖీతో వెలుగుచూసింది. కాగా, బంగారు నాణేలను జప్తు చేయడంతో పాటు గురువారెడ్డి కుటుంబ సభ్యులను హుజూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.