
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అన్యాయం జరిగినపుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అంబెడ్కర్ మాకు దైవంతో సమానం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బ్రతుకుతున్నారు అంటేనే కారణం అంబెడ్కర్ అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అంబెద్కర్ జయంతి ఉత్సవాలకు కేసీఆర్ రాకపోవడాన్ని మేము ప్రశ్నించాము తప్పు ఏముంది. ఇప్పటి వరకు 5 ఏండ్లు గడుస్తున్నా ఒక్క సారి కూడా అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనలేదు. పంజాగుట్టలోని అంబెడ్కర్ విగ్రహం విరగొట్టి డంపింగ్ యార్డ్ లో పడివేశారు. కేసీఆర్ పెడతాను అనిచెప్పిన 125 అడుగుల విగ్రహం కనపడడం లేదు కానీ మా వాళ్ళు పెట్టుకున్న అంబెడ్కర్ విగ్రహలను మాత్రం విరగగొడుతున్నారని అయన విమర్శించారు. అంబెడ్కర్ విగ్రహం విరగగొట్టడాన్ని నిరసిస్తూ మేము ధర్నా చేస్తాము అంటే ధర్నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఉద్దేశ్య పూర్వకంగా దళితులను అవమానిస్తున్నారు. తెరాస పార్టీ అధ్యక్షుడుగా కూడా కేసీఆర్ ఎప్పుడు అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతాం. ఎర్రవెల్లిలో ఉన్న అంబేద్కర్ విగ్రహంకు కూడా కేసీఆర్ కనీసం పూల దండ వేయలేదు. నిరసన తెలుపుతాం అంటే హౌజ్ అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర పోషించింది. ఉద్యమం నుండి ప్రభుత్వం ఏర్పడే వరకు అండగా ఉంది. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తాం అంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేసే వాళ్ళను శత్రువుల లాగా చూడకండి.మేము చేసే పోరాటాలు అన్ని ప్రజల కోసమేనని అయన అన్నారు.