
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో కాని కార్పొరేటర్ల లాబీయింగ్, చర్చలు గత రెండు నెలలుగా జోరుగా సాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు టిఆర్‌ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి గుండా ప్రకాష్‌రావుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. గతంలో మూడు సార్లు కార్పొరేటర్‌గా, వాసవీ క్లబ్ గవర్నర్‌గా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. మేయర్ పీఠం కోసం కార్పొరేటర్లు గుండు అశ్రితారెడ్డి, స్వరూపారాణి, వద్దిరాజు గణేష్, రంజిత్‌రావు, ఇన్‌చార్జ్ మేయర్ సిరాజుద్దీన్‌లు పోటీలో ఉన్నప్పటికి ప్రధానంగా గుండా ప్రకాష్‌రావుకే పార్టీ అధినేత కెసిఆర్, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ఎంఎల్‌ఎల ఆశీస్సులు ఉన్నట్లు తెలిసింది. ఏదీఏమైనప్పటికి ఈనెల 27న జరిగే ఎన్నికతో మేయర్ ఎవరనేది తేలనుంది.అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పటి నుండి అనేక మంది కార్పొరేటర్ల దృష్టి మేయర్ పీఠంపై పడింది. నగర మేయర్‌గా కొనసాగిన నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎగా గెలవడంతో ఆ పీఠం ఖాళీ అయింది. ఇందు కోసం టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు నిర్ణయించారు. మేయర్ ఎంపిక బాధ్యతను కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ నిర్ణయానికి కట్టబెట్టారు. దీంతో హైదరాబాద్‌లో కార్పొరేషన్ సంబంధించిన ఐదుగురి ఎంఎల్‌ఎలతో సమీక్షలు, మంతనాలు జరుగుతున్నాయి. ఆమోదయోగ్యమైన వ్యక్తిని ప్రభుత్వ లక్ష్యాలను కలుపుకొని పోయే వ్యక్తిని సూచించాలని కెటిఆర్ సూచించారని, ఇందుకు ఎంఎల్‌ఎలు వారి వారి డివిజన్లకు చెందిన కార్పొరేటర్ల గురించి కెటిఆర్‌కు వివరించారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. సంబంధించి సాధ్యమైనంత త్వరగా మేయర్ పీఠం ఖరారు చేయాలని కెటిఆర్ నిర్ణయించి ఎంఎల్‌ఎలతో మంతనాలు జరిపారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ జరిపి త్వరలోనే సూచనప్రాయంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.వరంగల్ మేయర్ స్థానం జనరల్ క్యాటగిరి స్థానం నుంచి ఎంపిక చేసేందుకు సమీక్ష నిర్వహించిన కెటిఆర్ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా జనరల్ స్థానమైన బిసి వర్గానికి చెందిన నన్నపునేని నరేందర్‌కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం జనరల్ స్థానం జనరల్‌లో గెలిచిన కార్పొరేటర్లకే ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు, పశ్చిమ ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వరంగల్ ఉండడం వల్ల ఈ రెండు స్థానాల ఎంఎల్‌ఎలు బిసి వర్గానికే కేటాయించారు. మేయర్ స్థానం జనరల్ క్యాటగిరి వారికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరుగుతుంది. ఒకవేళ జనరల్‌కు కేటాయిస్తే మేయర్ స్థానం కోసం కార్పొరేటర్లు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. జనరల్ స్థానంలో జనరల్ మహిళలకు దక్కుతుందా.. పురుషులకు దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది. మహిళలకైతే నాగమళ్ల ఝాన్సీ, గుండు అశ్రితారెడ్డి, నల్ల స్వరూపారాణిలకు మేయర్ పదవీ అవకాశాలు ఉన్నాయి. పురుష కార్పొరేటర్లలో గుండా ప్రకాష్‌రావు, వద్దిరాజు గణేష్, బోయినపల్లి రంజిత్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో మేయర్ పదవీ ఆశించిన కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య, పశ్చిమ ఎంఎల్‌ఎ సోదరుడు దాస్యం వినయ్‌భాస్కర్ సైతం తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇన్‌చార్జ్ మేయర్‌గా ఉన్న సిరాజుద్దీన్ సైతం తనకు అవకాశం కల్పించాలని మైనార్టీ రిజర్వేషన్లలో తనకే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. మొత్తానికి సాధ్యమైనంత త్వరగా మేయర్ స్థానం ఎన్నిక కోసం ఈనెల 23లోపు సభ్యులందరికి నోటీసులు పంపి 27న మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఈమేరకు మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు.