
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశంలో అన్ని వ్యవస్థలనూ మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్‌కు జరిగిన అవమానాల గురించి ఏపీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు.తెలంగాణలో అంబేద్కర్‌కు జరిగిన అవమానాల గురించి ఏపీ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు.,ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై కూడా వీహెచ్ ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఓవరాక్షన్ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల కమిషన్ ఏనాడూ ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్‌ను అకారణంగా తొలగించారని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిచడం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించే వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఓవరాక్షన్ చేస్తోందని, ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని వీహెచ్ విమర్శించారు. బీజేపీ పెద్దలు ఎవరిపై దాడి చేయమంటే.. వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని వి ఎచ్ ఆరోపించారు.