
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే , ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థుల నుండి తాము పార్టీ మారమని అఫిడవిట్లు తీసుకోనుంది.ప్రజల్లో విశ్వాసం కలిగించి, టిఆర్ఎస్ కు చెక్ పెట్టే సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పార్టీ మారమని అఫిడవిట్ ను స్థానిక నాయకత్వానికి దాఖలు చేయాల్సిందేనని టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారి టీఆర్ఎస్ బాట పట్టారు. ఎమ్మెల్సీలు సైతం టిఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలు సైతం ఆలోచనలో పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటేసి గెలిపిస్తే పార్టీలో ఉంటారా లేదా టిఆర్ఎస్ పార్టీలో చేరతారా అని ఆలోచన ప్రజల్లో సైతం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ , పార్టీ మారమని అఫిడవిట్లు ఇచ్చి ప్రమాణం చేయించుకుని మరీ అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ మారమని ప్రమాణం చేసి , అఫిడవిట్లు దాఖలు చేయాలని నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఎదురైంది. పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులను పార్టీ మారమని ప్రమాణం చేసి , అఫిడవిట్లు దాఖలు చేయాలని చెప్పే పరిస్థితి వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ నుండి కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కి ఇంతకంటే మరో మార్గం కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అభ్యర్ది గెలిచిన తరువాత పార్టీ మారరన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో పాటు, టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నేతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నుండి వలసలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పార్టీని వీడి ఎవరు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు గా తాజా పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. అఫిడవిట్ లకు చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అఫిడవిట్ల కు చట్టబద్ధత ఉంటుందా అంటే అనుమానమే అని చెప్పక తప్పదు. స్టాంప్ పేపర్‌పై అభ్యర్థి రాతపూర్వకంగా హామీ ఇస్తున్న నేపథ్యంలో పార్టీ మారితే చీటింగ్ కేసు పెట్టేందుకు ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయాలు వచ్చాయి. అయితే ఇది లీగల్‌గా ఏ మేరకు నిలబడుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అభ్యర్థులు పార్టీ మారబోరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించడమే ప్రధానమైనటువంటి అంశంగా అఫిడవిట్లు తీసుకోవాలనే నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పార్టీ మారబోమని అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ మారబోనని అఫిడవిట్ ఇచ్చిన పొన్నం ప్రభాకర్ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు... తర్వాత కారెక్కారు. కాంగ్రెస్ నుంచి గెలిచినా పార్టీలో ఉంటారో లేదో నమ్మకం లేదన్న ప్రజల విశ్వాసం కోసం తాను పార్టీ మారేది లేదంటూ అఫిడవిట్ విడుదల చేశారు. మాజీ ఎంపీ, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని అఫిడవిట్ ద్వారా ప్రకటించారు. ఒకవేళ పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో తనపై చీటింగ్, క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చని తెలిపారు పొన్నం ప్రభాకర్. స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ .. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది .కనీసం 20 జడ్పీ లను కైవసం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటాలని భావిస్తున్న నేపథ్యంలోనే అటు ఓటర్లకు భరోసానిస్తూ, ఇటు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న టిఆర్ఎస్ కు చెక్ పెడుతూ అభ్యర్థుల నుండి అఫిడవిట్లు తీసుకోవాలని నిర్ణయించింది.