
పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నేతలు గెలుపు అంశం పై ఎవరి ధీమాలో వారున్నారు...ఎవరికి వారే లెక్కలు బేరీజువేసుకుని గెలుపుతో పాటు మెజార్టీ అంచనా వేసుకుంటున్నారు..కానీ ప్రతిసారి విలక్షణమైన తీర్పునిచ్చే ఖమ్మం ప్రజలు ఈ సారి ఎవరికి పట్టం కట్టనున్నారో..నేతలు అయోమయోంలో ఉన్నారు...జరిగిన పార్లమెంటు ఎన్నికల పై పార్టీల మనోభావాలు భిన్న్గంగా ఉన్నాయి...ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం తగ్గడం, ఓటర్లకు పంపిణి లేకపోవడం ఫలితంగా ఓటింగ్ సరళిపై ఉత్కంఠత నెలకొంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ప్రధాన పోటీ నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరి మధ్యే కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి వాసుదేవరావు, సీపీఐ బలపరిచిన సీపీఎం అభ్యర్థి బరిలో ఉన్నా ఓట్లు చీల్చేందుకు తప్ప విజయం సాధించే అవకాశాలు లేవు. ఆయా పార్టీల నేతలు కూడా పోలింగ్ జరిగిన తీరును సమీక్షించుకుంటున్నారు. ట్రెండ్ తమకే అనుకూలంగా ఉందని లెక్కలేసుకుంటున్నారు. అనుకూల అంశాలు, ప్రతి కూల అంశాలను బేరీజు వేసుకొని మెజార్టీ ఎంతొస్తుందనే అంచనాలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓవైపు గెలుపు ధీమా కనిపిస్తున్నా మరోవైపు క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. నియోజకవర్గంలో ఒక పార్టీ అభ్యర్థి మాత్రమే ఓటర్లకు డబ్బులు పంచారని సమాచారం.అయితే ఖమ్మం నగరంలో కొన్ని డివిజన్ల ఓటర్లకు డబ్బులు చేరగా, మరికొన్ని డివిజన్లలో ఇవ్వకపోవడంతో పలు చోట్ల స్థానికులు ఆందోళనకు దిగారు. పై నుంచి డబ్బులు వచ్చినా నాయకులు మింగేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సొంత పార్టీ అనుకున్న వారు కూడా ఇతరులకు డబ్బులు అంది తమకు రాకపోవడంతో ఆగ్రహంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వైపు ఓట్లు క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మరో పార్టీ అభ్యర్థి అసలు డబ్బులు పంచకపోవడంతో ఒక అభ్యర్థి దగ్గరే డబ్బులు తీసుకున్న వారు ప్రత్యర్థి పార్టీకి చెందిన వారైనా కూడా డబ్బులు వచ్చాయనే సానుభూతితో మరోపార్టీకి ఓటేసినట్టు సమాచారం. ఇలా రెండు పార్టీల అభ్యర్థుల మధ్య క్రాస్ ఓటింగ్ జరగడం ఎవరికి అనుకూలమనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు, టీడీపీ రెండు, టీఆర్ఎస్ ఒకటి గెల్చుకోగా ఇండిపెండెంట్ అభ్యర్థి మరో సీటులో విజయం సాధించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారతామని ప్రకటించినా పెద్దగా వారి వెంట ఉన్న కేడర్ మారకపోవడంతో ఓటింగ్ తమకు అనుకూలంగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో తమ పార్టీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని హస్తం నేతలు చెప్పుకొస్తున్నారు. ఓటర్లకు రూపాయి కూడా పంచకపోయినా ఫలితం తమకే సానుకూలంగా ఉంటుందని ధీమాతో చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ అంచనాలు మరోరకంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిణామాలు టీఆర్ఎస్ కే కలిసొస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతల చేరికలతో తమ బలం మరింత పెరిగిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ బలం నిరూపితమైందని, వర్గాలకు అతీతంగా నేతలంతా కలిసి పనిచేయడం కేడర్ కు సానుకూలం సంకేతాలను పంపిందని, అందుకే ఫలితం తమకే సానుకూలమని కారు పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక బీజేపీ, సీపీఎం అభ్యర్థులు ప్రధాన పోటీలో ఉన్నా ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారి కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయగా ఖమ్మంలో సీపీఎం అభ్యర్థి బోడ వెంకట్ బరిలో నిలిచారు. రెండు పార్టీలకు చెందిన కేడర్ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నా ఓటింగ్ ఎంత వరకు ఆ పార్టీలకు అనుకూలంగా పోల్ అయ్యిందనేది తేలడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ ఎఫ్ గా బరిలోకి దిగిన సీపీఎంకి ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి దాదాపు 56 వేల ఓట్లు పోలయ్యాయి. ఈసారి సీపీఐ కూడా కలిసి రావడంతో డిపాజిట్ దక్కించుకుంటామన్న ధీమాతో కామ్రెడ్లు ఉన్నారు. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతతో తమకు ఓటింగ్ పెరుగుతుందని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి కూడా డిపాజిట్ దక్కించుకుంటామన్న ఆశల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 వేల లోపు ఓట్లు మాత్రమే పోలైనా ఈసారి జాతీయ ఎన్నికలు కావడంతో మోడీ మేనియా తమకు కలిసి వస్తుందని కమలం నేతలు ఆశపడుతున్నారు. కనీసం లక్ష ఓట్లు క్రాస్ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో జరిగిన పోలింగ్ అంతా ఒక వైపైతే ఖమ్మం జిల్లా పీపుల్ పల్స్ మాత్రం మరో వైపుంటుంది కనుక ఎవరి లెక్కల్లో వాళ్లున్నా ఓటర్లు తీర్పు ఎటు ఇచ్చారన్నది మాత్రం మే 23న తేలనుంది..