
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ కు అదనపు ఆకర్షణలు చేరనున్నాయి. ఇప్పటికే ఉన్న పక్షుల కేంద్రానికి అదనంగా మరో భారీ పక్షుల సందర్శన కేంద్రానికి అటవీ శాఖ శంకుస్థాపన చేసింది. భూమి పూజలో పీసీసీఎఫ్ పీ.కే.ఝా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక కోల్ కతా నుంచి ఇటీవలే తరలించిన రెండు జిరాఫీలు బబ్లీ, బంటీ లు పూర్తి స్థాయిలో జూ పార్క్ వాతావరణంకు అలవాటు పడ్డాయి. దీంతో ఈ రెండు జిరాఫీలను సందర్శకులు చూసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ లోకి విడుదల చేశారు. ఇప్పటికే ఉన్న ఒక జిరాఫీకి ఈ రెండూ తోడవటంతో జూపార్క్ లో జిరాఫీల సంఖ్య మూడుకు పెరిగింది. ఆ తర్వాత జూ పార్క్ లో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, సందర్శకుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. మీరాలం ట్యాంక్ పరిసరాలు, స్థానిక నాలా నుంచి జూ పార్క్ లోకి వెలుతున్న నీటి మళ్లింపు పనులపై అధికారులు చర్చించారు. ఇటీవల అభివృద్ది పరిచిన రెప్ టైల్స్ ( సరిసౄపాలు) ఎన్ క్లోజర్ , పాత పక్షుల కేంద్రం చుట్టూ సందర్శకులు నడుస్తూ వెళ్లేలా చేస్తున్న మార్పుల పనులను అధికారులు పర్యవేక్షించారు. పులుల సఫారీ కోసం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఏసీ బస్సు పనితీరును కూడా పరిశీలించారు. దేశంలోనే పేరుపొందిన నెహ్రూ జూ పార్క్ ను మరింత ఆకర్షణీయంగా, జంతువుల ఆవాసానికి మెరుగైన వసతులు కల్పించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేయబోయే వాకింగ్ ఎవియరీ (పక్షుల కేంద్రం) కచ్చితంగా జూ పార్క్ కు అదనపు ఆకర్షణగా మారుతుందని పీసీసీఎఫ్ పీ.కే.ఝా అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పీ.కే.ఝాతో పాటు మరో పీసీసీఎఫ్ పృధ్వీరాజ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, అదనపు పీసీసీఎఫ్ లు మునీంద్ర, శోభ, డోబ్రియల్, సిద్దానంద్ కుక్రేటీ, ఓఎస్డీ శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.