
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్ బోర్డ్ అవకతవకలపై హైకోర్టు లో దాఖలయిన పిటిషన్ ను కోర్టు విచారించింది. దీంతో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కోర్టుకు హాజరయ్యారు. ఇంటర్ మొదటి ఏడాదిలో టాప్లో మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు, రెండో ఏడాదిలో తక్కువ మార్కులు రావడం.. అంటే కొంతమందికి సున్న మార్కులు, మరికొంతమందికి 5, 6 మార్కులు రావడం.. ఆ తప్పిదాలకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ బాలల హక్కుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బోర్డు నిర్లక్ష్యం వల్లే 16 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం తమ పిటిషన్లో పేర్కొంది. ఈ 16 మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్ కోర్టును కోరారు. అలాగే, ఎలాంటి ఫీజు లేకుండా పేపర్ రేవాల్యుయేషన్ చేయాలని కోరారు. గ్లోబరినా టెక్నాలజీ సంస్థ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి సంస్థ పై తగు చర్యలు తీసుకోవాలని కుడా పిటిషనర్ కోరారు. దీనిపై న్యాయవిచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై త్రిసభ్య కమిటీ వేశామని అదనపు ఏజీ రామచంద్రరావు వివరణ ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత కేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.