YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కిం కర్తవ్యం... చంద్రుల దారి ఎటు...

కిం కర్తవ్యం...  చంద్రుల దారి ఎటు...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అట్టర్ ప్లాఫయ్యారు. 2019 ఎన్నికలు తమ దశ, దిశ మార్చేస్తాయని భ్రమ పడి బోర్లా పడ్డారు. కలలు కల్లలయ్యాయి. తమ సామర్థ్యాన్ని మించి ఎగిరేందుకు ప్రయత్నించి వైఫల్యం చెందారు. దేశంలోని రాజకీయ వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేక చతికిలపడ్డారు. ఒకరు రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలో పట్టు కోల్పోయారు. మరొకరికి కేంద్రం వద్ద పరపతి పోయింది. రాష్ట్రంలో కొత్త ప్రత్యర్థిని తెచ్చిపెట్టుకున్నారు కేసీఆర్. అటు రాష్ట్రంలో ఆదరణ కోల్పోయి ఇటు కేంద్రంలో మొఖం చెల్లక చంద్రబాబు నాయుడు రాజకీయ సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. మొత్తమ్మీద ఇద్దరు చంద్రులు తమ ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యాన్ని కోల్పోయారు. మొన్నటివరకూ అంటకాగిన యూపీఏకు, పూర్తి శత్రుత్వాన్ని కనబరిచిన ఎన్డీఏకు సమదూరం అంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ‘బీజేపీ తో దోస్తానా లేదు. దుష్మనీ కాదు.’అంటూ కేసీఆర్ తటస్థ అజెండా పట్టుకున్నారు. చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఇవి. అయితే ఇప్పటికే కేసీఆర్, చంద్రబాబుల ఎత్తుగడలు పసిగట్టిన బీజేపీ టార్గెట్ టీడీపీ, టీఆర్ఎస్ అన్నట్లుగా పావులు కదుపుతోంది. వీరిద్దరూ భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలో కూటమి కట్టేందుకు, చక్రం తిప్పేందుకు అవకాశం లేనివిధంగా కట్టడి చేయాలనేది కమలనాథుల వ్యూహం.తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లేందుకు కేసీఆర్ కు సంపూర్ణంగా సహకరించింది. కేసీఆర్ తాము చెప్పిన మాట వింటారని ఆశించింది. ఎన్డీఏకు సీట్లు తగ్గితే దక్షిణాధిన కేసీఆర్ ఆదుకుంటాడని లెక్కలు వేసుకుంది. ఏపీ నుంచి వైసీపీతో బేరసారాలు జరిపి ఆ మద్దతును సైతం కూడగట్టగలిగే సామర్థ్యం కేసీఆర్ కు ఉందని బీజేపీ అగ్రనాయకత్వంబలంగా విశ్వసించింది. రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లి కొంచెం తెలివైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అధికారాన్ని కేసీఆర్ నిలబెట్టుకోగలిగారు. అప్పటివరకూ బీజేపీతో ఉన్న సత్సంబంధాలను క్రమేపీ తెంచుకుంటూ పోయారు. బీజేపీ బలాన్ని కోల్పోయిందని , సంకీర్ణశకం మళ్లీ వస్తుందని కేసీఆర్ రాజకీయంగా తప్పుడు అంచనాలు వేశారు. రాష్ట్రాల సమాఖ్య, సెక్యులర్ ప్రభుత్వం అంటూ కొత్త కూటమి యత్నాలు చేశారు. ముఖ్యంగా వైసీపీ, డీఎంకే, జేడీఎస్ లతో కలిసి మంత్రాంగం నెరిపారు. బీజేపీకి సవాల్ విసరాలని చూశారు. 2016-17 ల మధ్యలో టీఆర్ఎస్ ఎన్డీఏ కూటమిలో చేరి మంత్రిపదవి తీసుకుంటుందనే ఊహాగానాలు సాగాయి. దానిని ద్రుష్టిలో పెట్టుకునే తమ సొంతపార్టీ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ తెలంగాణలో పెద్దగా ప్రయత్నించలేదు. కేంద్రమంత్రులు రాష్ట్ర పర్యటనలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తేవారు. అదంతా పక్కనపెట్టి సొంత యత్నాలతో జాతీయ నాయకునిగా ఎదగాలనుకున్నారు కేసీఆర్. దీనిని గమనించి లోక్ సభ ఎన్నికల్లో అన్నిరకాల యత్నాలు చేసి బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకుని బలమైన ప్రత్యర్థిగా నిలిచింది. నాలుగేళ్ల తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దీటుగా ఎదిగే ప్రణాళిక సిద్ధం చేస్తోంది.రాజకీయంగా అవకాశాలను పసిగట్టడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. ప్రతి రాజకీయ పరిణామాన్ని తనకు అనుకూలంగా తన కాతాలో పడేట్లు చేసుకోగల నైపుణ్యం ఆయన సొంతం. కానీ ఏడాదిన్నర కాలంగా ఆయన వేసిన ఎత్తుగడలన్నీ విఫలమవుతున్నాయి. వికటిస్తున్నాయి. బీజేపీకి, ప్రత్యేకించి నరేంద్రమోడీకి కేంద్రంలో కాలం చెల్లిపోతుందని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అందుకే ఎన్డీఏ నుంచి దూరం జరిగారు. మోడీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేశారు. రాష్ట్రంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు సైతం బీజేపీయే కారణమన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. మమతా బెనర్జీ తర్వాత దేశంలో మోడీని వ్యక్తిగతంగా తీవ్రంగా దూషించిన నేతగా చంద్రబాబు నాయుడు రికార్డు స్రుష్టించారు. అంతేకాకుండా బీజేపీకి కేంద్రంలో చెక్ పెట్టాలని వ్యూహం పన్నారు. కాంగ్రెసుతో కలిసి ఎన్డీఏ కు ప్రత్యామ్నాయం ఆవిష్కరించాలని చూశారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల కూటమిని రంగంలోకి తేవడం ద్వారా బీజేపీని, కాంగ్రెసును అధికారానికి దూరం చేయాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెసును అధికారంలోకి తేవాలనుకున్నారు. దేశంలో బీజేపీకి అనుకూలంగా బలమైన గాలి వీస్తున్న దశలో తప్పుడు ఎత్తుగడ వేశారు. దీంతో బీజేపీకి ప్రధాన వ్యక్తిగత ప్రత్యర్థిగా మారారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధినేత అనాలోచిత చర్యల కారణంగా వైసీపీ నాయకత్వం బీజేపీకి చేరువైంది.బీజేపీతో పొత్తు కారణంగా రెండు సార్లు అధికారంలోకి రాగలిగారు చంద్రబాబు నాయుడు. వాజపేయి నేత్రుత్వంలోని మొదటి ఎన్డీఏ ప్రభుత్వానికి అండగానూ నిలిచారు. నరేంద్రమోడీ నేత్రుత్వంలోని ఎన్డీఏ పట్ట చంద్రబాబుకు సదభిప్రాయం లేదు. చంద్రబాబు వైఖరిపై మోడీకి కూడా విశ్వాసం లేదు. అయినప్పటికీ రాష్ట్ర అవసరాల కోసం కలిసి నడిచారు. చివరి సంవత్సరంలో మాత్రం ప్లేటు ఫిరాయించి చంద్రబాబు తన మార్కు నిరూపించుకోవాలనుకున్నారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం లేదా యూపీఏ అధికారంలోకి వచ్చేలా శతవిధాలా ప్రయత్నించారు. ప్రజాదరణ లేకపోవడంతో ఏపీలో టీడీపీ దెబ్బతింది. ఒకవేళ ఎన్డీఏలో భాగంగా కొనసాగి ఉంటే కే్ంద్రంలో భాగస్వామిగా ఎంతోకొంత గౌరవం దక్కి ఉండేది. అలాగే కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెసుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండటం వల్ల బీజేపీ తెలంగాణపై పెద్దగా ద్రుష్టి పెట్టలేదు. జాతీయంగా బీజేపీని దెబ్బతీసే ఎత్తుగడలు వేస్తున్నట్లుగా తాజా ఎన్నికల్లో తేలడంతో టీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్రంలో సిద్ధమవుతోంది. పశ్చిమబంగ ప్రయోగాన్నే ఇక్కడ కూడా చేయాలనుకుంటోంది. అక్కడ త్రుణమూల్ కాంగ్రెసుకు ప్రధాన ప్రత్యర్తులుగా కాంగ్రెసు, కమ్యూనిస్టులు పార్టీలు ఉన్నాయి. కానీ వాటిని తోసిరాజని సైద్ధాంతిక దూకుడుతో బీజేపీ ముందుకొచ్చేసింది. తెలంగాణలో సైతం కాంగ్రెసును పక్కనపెట్టి టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించాలని బీజేపీ చూస్తోంది. కేంద్రంతో సత్సంబంధాలు పోయాయి. రాష్ట్రంలో మరో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ రూపుదిద్దుకుంటోంది. ఒక విధంగా కేసీఆర్ కు సైతం భవిష్యత్తులో చిక్కుముడులే.

Related Posts