
మళ్లీ పాత కక్షలు.. చావు బతుకుల్లో రవి
అతపురం,
ఫ్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఫ్యాక్షన్ తరహా దాడి కలకలం రేపింది. కొందరు వ్యక్తులు మారణాయుధాలతో ఓ యువకుడిని వెంబడించి నడిరోడ్డుపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఘటన అమలాపురంలో సోమవారం చోటుచేసుకుంది. దాడి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.అమలాపురం పట్టణంలోని సావరం ప్రాంతానికి చెందిన విప్పర్తి రవి అనే యువకుడు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అదే పట్టణానికి చెందిన దువ్వా చిన్నా, షేక్ యోహోన్, గరగబోయిన చినపండు, చందు రవి అనే వ్యక్తులతో పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈదరపల్లి వంతెన సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న రవిపై ప్రత్యర్థులు దాడికి దిగారు. కత్తులతో అతడిని వెంబడించి యాక్సిస్ బ్యాంక్ సమీపంలో దారుణంగా నరికి వెళ్లిపోయారు.తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కాకినాడకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై అమలాపురం సీఐ సురేశ్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో యోహోన్‌కు చెందిన సెప్టిక్ ట్యాంక్‌ను రవి వర్గీయులు ధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు రవిపై అటాక్ జరిగిందని ఆయన తెలిపారు. రవిపై దాడికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీ బయటకు వచ్చిందని, అయితే ఆ ప్రాంతంలో పోలీసులు, మున్సిపల్ శాఖకు సంబంధించి సీసీ కెమెరాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఈ దృశ్యాలు ఎవరు రిలీజ్ చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.